రాహుల్ పోటీ తెలంగాణ నుంచేనా?
posted on Feb 27, 2024 @ 1:07PM
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ వచ్చే లోక్ సభ ఎన్నికలలో ఎక్కడ నుంచి పోటీ చేయనున్నారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఆయన తన సొంత నియోజకవర్గం అమేథితో పాటు కేరళలోని వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కూడా బరిలోకి దిగారు. ఆ ఎన్నికలలో ఆయన అమేథి నుంచి పరాజయం పాలయ్యారు. అమేథి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన స్మృతి ఇరానీ విజయం సాధించారు. కాగా రాహుల్ వాయనాడ్ నుంచి విజయం సాధించి లోక్ సభలో అడుగు పెట్టారు.
మరి 2024 ఎన్నికలలో ఆయన పోటీ ఎక్కడ నుంచి అనేదానిపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు. అమేథి పక్కన పెడితే రాహుల్ వాయనాడ్ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు దాదాపు మృగ్యమనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ నుంచి సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా సతీమణి యాని రాజాను సీపీఐ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించేసింది. ఇండియా కూటమిలో భాగంగా పొత్తు చర్చల ప్రారంభానికి ముందే వాయనాడ్ బరిలో యానీ రాజా పోటీ ఖరారు అయిపోవడంతో రాహుల్ గాంధీ మళ్లీ నియోజకవర్గం మారక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో రాహుల్ తెలంగాణ నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయన్న చర్చ మొదలైంది.
ఈ చర్చకు కారణం ఆయనను తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం. ఆయనను భువనగిరి లేదా ఖమ్మం నుంచి ఎన్నికల బరిలో దిగాల్సిందిగా రేవంత్ కోరారు. ఇదే విషయమై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో రేవంత్ చర్చించినట్లు సమాచారం. మొత్తం మీద రాహుల్ గాంధీ ఈ సారి ఎన్నికలలో దక్షిణాది నుంచే పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు తెలంగాణయే సేఫ్ అన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. అయితే ఖమ్మం బరిలో కుసుమ కుమార్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్న నేపథ్యంలో అయితే గియితే రాహుల్ గాంధీ భువనగిరి నుంచి పోటీ చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.
తెలంగాణ ప్రస్తుతం కాంగ్రెస్ కు సేఫ్ ప్లేస్ అనడంలో సందేహం లేదు. అందులోనూ ఖమ్మం, భువనగిరి లోక్ సభ నియోజకవర్గాలైతే కాంగ్రెస్ విజయానికి ఢోకా ఉండదని చెబుతున్నారు. అసలు సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని రేవంత్ కోరారు. ఆమె కూడా సుముఖంగా స్పందించినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆమె రాజస్థాన్ నుంచి రాజ్య సభకు వెళ్లడంతో ఆమెకు బదులుగా ప్రియాంకను రాష్ట్రం నుంచి లోక్ సభ బరిలోకి దింపాలన్న ప్రయత్నాలు కూడా జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే ప్రియాంక మాత్రం తన తల్లి పోటీ చేసిన రాయబరేలి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దీంతో ఆ కుటుంబం నుంచి ఎవరో ఒకరిని రాష్ట్రం నుంచి లోక్ సభకు పంపాలన్న పట్టుదలతో ఉన్న రేవంత్ రాహుల్ గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయాల్సిందిగా కోరుతున్నారు. రాహుల్ గాంధీ కూడా ఇప్పటి వరకూ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న స్పష్టత లేకపోవడంతో ఆయన తెలంగాణ నుంచి బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.