ఆ నలుగురూ రాజీనామా చేస్తే 28 నియోజకవర్గాల అభివృద్ధి.. రేవంత్
posted on Aug 21, 2022 9:11AM
మునుగోడు అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేశానని అంటున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి, నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసమే ఉప ఎన్నిక అంటున్న బీజేపీకి తెలంగాణ కాంగ్రస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టి రిటీర్డ్ ఇచ్చారు. అభివృద్ధి కోసమే అయితే రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ నుంచే పోటీ చేయవచ్చుకదా అని ప్రశ్నించారు.
చౌటుప్పల్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రాజగోపాలరెడ్డి సరే అంటే ఆయనకు కాంగ్రెస్ బీఫాం ఇస్తామన్నారు. అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసమే ఉప ఎన్నిక అంటున్న బీజేపీ ఒక్క మునుగోడుతో ఆగిపోవడం ఎమిటని ప్రశ్నించారు. ఆ పార్టీకి ఉన్న నలుగురు ఎంపీలూ రాజీనామా చేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాలు అభివృద్ది చెందుతాయిగా అన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని అన్నారు.
మునుగోడులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొదరుడు, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం చేస్తారని రేవంత్ చెప్పారు. పార్టీ మారిన వారు తనపై విమర్శలు చేయడాన్ని రేవంత్ లైట్ గా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తన ఒక్కడిదీ కాదనీ,చాలా మంది సీనియర్లు ఉన్నారనీ చెప్పిన రేవంత్.. సమష్టిగా ముందుకు సాగుతామన్నారు.
రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కేసీఆర్ భ్రష్టు పట్టించారనీ, అలాగే కేంద్రం కూడా రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని విమర్శించిన రేవంత్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని, డిండి ఎత్తిపోతల పథకానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.