మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనలో జాప్యం ఎందుకంటే?
posted on Aug 21, 2022 @ 9:34AM
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని ఖరారు చేసి చాలా రోజులే అయ్యింది. ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా కేసీఆర్ నేడో రేపో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అసలు శనివారం (ఆగస్లు 20)న మునుగోడులో జరిగిన సభలోనే కేసీఆర్ ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు భావించాయి. అలా భావించానికి కారణం మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి పేరును సీఎం కేసీఆర్ మునుగోడు బహిరంగ సభ వేదికగా ప్రకటిస్తారని గతంలో చెప్పారు.
దీంతో అంతా సభా వేదిక మీద నుంచి కేసీఆర్ అభ్యర్థి పేరును ప్రకటించి, ప్రజలకు ఆయనను పరిచయం చేస్తారని అనుకున్నారు. కానీ వ్యూహాత్మకంగా వ్యవహరించిన కేసీఆర్ సభా వేదిక నుంచి మునుగోడు అభ్యర్థిని ప్రకటించలేదు. కనీసం చూచాయిగా కూడా ఆ ప్రస్తావన తీసుకురాలేదు. ఎందుకంటే మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని ప్రకటిస్తే తామంతా సహాయ నిరాకరణ చేస్తామని అసంతృప్తి నేతలు ఒక సమావేశం పెట్టి మరీ నిర్ణయించడంతో అభ్యర్థి ప్రకటన వాయిదా పడిందని అంటున్నారు. అసమ్మతి నేతలతో మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశం సత్ఫలితాన్ని ఇవ్వలేదు. జగదీశ్ రెడ్డితో భేటీ తరువాత కూడా అసమ్మతి జ్వాలలు ఎగసి పడుతూనే ఉన్నాయి.
మునుగోడుకు చెందిన కొందరు అసమ్మతి నేతలు బీజేపీ గూటికి చేరడమూ జరిగిపోయింది. ఇంకా పలువురు అసమ్మతి నేతలు కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని బహిరం సభ వేదికగా ప్రకటిస్తే.. ఆ తరువాత తామూ ఒక సభ పెట్టి తన నిర్ణయాన్ని వెలువరిస్తామని హెచ్చరించినట్లు కూడా చెబుతున్నారు. కేసీఆర్ స్వయంగా అసమ్మతి నేతలతో భేటీ అయ్యి బుజ్జగించినా పూర్తి ఫలితం రాలేదన్నది పార్టీ వర్గాల కథనం.
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వ్యూహాత్మకంగా బహిరంగ సభ వేదికగా అభ్యర్థి పేరును ప్రకటించలేదని అంటున్నారు. ముందుగా మునుగోడులో కూసుకుంట్ల అభ్యర్థిత్వంపై ఉన్న వ్యతిరేకతను చల్లార్చిన తరువాతే అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇంకా ఉప ఎన్నిక నోటిఫికేషనే వెలువడలేదు.. అప్పుడే అభ్యర్థి ప్రకటనపై తొందర ఎందుకు, వేచి చూసే ధోరణి అవలంబించడం బెటర్ అని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.