కొత్త రాజధాని పరిసర ప్రాంతాలలో రియల్ భూమ్
posted on May 27, 2014 @ 3:18PM
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న చంద్రబాబు గుంటూరులో తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకొని అక్కడి నుండే పరిపాలన సాగించేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. కనుక వీ.జీ.టీ.యం. అర్బన్ డెవలప్ మెంట్ సంస్థ పరిధిలో ఉన్న విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి ప్రాంతాలను సత్వరమే అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అందువలన అక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మించె అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ అంచనాలతో ఆ పరిసర ప్రాంతాలలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చేసాయి.
చంద్రబాబు గుంటూరులో తన క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకోబోతున్నట్లు రూడీ అయినప్పటి నుండి వీ.జీ.టీ.యం. పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలలో కూడా భూముల ధరలు దాదాపు 20 నుండి 40 శాతం వరకు పెరిగాయి. కేసీఆర్ పుణ్యమాని హైదరాబాదులో స్థిరపడిన ఉద్యోగులు కూడా కొత్తరాజధానికి తరలిపోవలసి వచ్చేలా ఉండటంతో ఎందుకయినా మంచిదని వారు కూడా ఈ ప్రాంతాలలో భూములు, ఫ్లాట్లు కొనేందుకు ఆసక్తి చూపుతుండటంతో ధరలు పెరిగిపోయాయి. వీరే గాక ప్రముఖ స్టార్ హోటల్స్, వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు, విదేశాలలో స్థిరపడిన ఆంద్ర ప్రజలు చాలా మంది ఇక్కడ భూములు కొనేందుకు క్యూ కడుతుండటంతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి.
ఆ నాలుగు ప్రాంతాలలోనే కాక, పక్కనున్న ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడా ఆవేడి బాగానే సోకుతోంది. కారణం కొత్త రాజధానికి పొరుగున ఉండటమే. రాజధాని, దానితోబాటే ప్రభుత్వోద్యోగులు, వివిధ సంస్థలు అన్నీ తరలి వచ్చే అవకాశం కనబడుతున్నందున ఈ ప్రాంతాలలో ఇళ్ళు, వ్యాపార సముదాయాలు అద్దెలు కూడా క్రమంగా పెరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ ప్రాంతాలలో ఇదివరకు భూములపై పెట్టుబడులు పెట్టి అమ్ముకోలేక నష్టాలలో కూరుకుపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇది చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తమ అప్పుల నుండి బయటపడటమే కాక, మళ్ళీ లాభాలు కూడా ఆర్జించవచ్చని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు అయినకాడికి అమ్ముకొని బయటపడదామని చూసిన రియాల్టర్లు, ఇప్పుడు ఇంకా మున్ముందు భూముల ధరలు మరింత పేరుగా వచ్చనే ఆశతో అమ్మకాలు నిలిపివేసి కూర్చొన్నారు.
ఇదంతా చూసి స్థానిక మధ్యతరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అమాంతం పెరిగిపోయిన ఈ ధరలతో ఇక స్వంత ఇంటి కల కలగానే మిగిలిపోతుందని వాపోతున్నారు. ఈసారి అభివృద్ధిని వికేంద్రీకరించి, శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు అన్ని జిల్లాలకు సమానంగా వ్యాపింపజేయాలని చంద్రబాబుతో సహా అందరూ భావిస్తున్నదున మిగిలిన జిల్లాలలో భూములు ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి వంటి ప్రధాన నగరాలలో కొందరు పెద్ద రియాల్టర్లు భూముల అమ్మకాలకు తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇందుకు ప్రజలు ఆనందించాలో బాధపడాలో తెలియని పరిస్థితి.