తెలంగాణ యంపీలకు కాంగ్రెస్ షాక్
posted on Apr 15, 2013 @ 7:01PM
తెలంగాణ కాంగ్రెస్ యంపీలు కోరుకోన్నట్లే, వారు తెరాస అధినేత కేసీఆర్ తో జరుపుతున్న రహస్య సమవేశాల గురించి కాంగ్రెస్ అధిష్టానం చెవుల్లో పడింది. అయితే వారు ఆశిస్తున్నట్లు డిల్లీ నుండి వారిని బుజ్జగించేందుకు ఎవరూ బయలు దేరబోవడం లేదు, కానీ “మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరయినా ఎప్పుడయినా పార్టీలు మారొచ్చు. అందులో అభ్యంతరం పెట్టేందుకు ఏమీ లేదు” అని ఒక పిడుగులాంటి సందేశం కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషిద్ అల్వీ నోటి ద్వారా తాజాగా వెలువడింది. మరో విధంగా చెప్పాలంటే, ‘ఉంటే ఉండండి పోతే పొండని’ ఆయన మాటలకి అర్ధం.
ఇంతవరకు వచ్చిన తరువాత వారు ఇప్పుడు పార్టీలోనే ఉన్నా వారికి వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్స్ ఇస్తుందని నమ్మకం లేదు. కాంగ్రెస్ అధిష్టానానికి అనుకూలంగా మారిన నిజామాబాద్ యంపీ మధు యాష్కీ సహచర యంపీలతో సమావేశం అయినప్పటికీ, తానూ పార్టీని వీడేదిలేదని స్పష్టం చేసారు. ఇక రాజయ్య, మంద జగన్నాథ రావు, కే.కేశవ్ రావు ముగ్గురూ కూడా తాము కాంగ్రెస్ పార్టీని వీడేoదుకే నిశ్చయించుకొన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఇక మిగిలిన యంపీలు పొన్నాల ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ తదితరులు మరియు శాసనసభ్యులు కోమటి రెడ్డి సోదరులు ఇంకా అయోమయ స్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితి నుండి వారు ఎంత త్వరగా బయటపడి నిర్ణయం తీసుకొంటె అంత మంచిది. ఒకసారి కాంగ్రెస్ పార్టీలో వారికి గౌరవం తగ్గితే, అప్పుడు కేసీఆర్ దృష్టిలో కూడా వారు పలుచన అవడం ఖాయం. అప్పుడు వారి పరిస్థితి రెంటికీ చెడిన రేవడిగా మారుతుంది.