కొత్తపల్లికి భలే ఛాన్స్
posted on Mar 7, 2012 @ 9:37AM
నర్సాపురం: గత ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుకు రాబోయే ఉప ఎన్నిక ఊపిరినిచ్చింది. నర్సాపురం నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా నిలబడటం దాదాపు ఖాయమైంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముదునూరి ప్రసాదరాజుపై అనర్హత వేటు పడటంతో అక్కడ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో టిడిపి లో ఉంటూ మంత్రిగా చేసిన కొత్తపల్లి తరువాత పిఆర్పీలో చేరి పరాజయం పాలయ్యారు. అనంతరం పిఆర్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆయన కాంగ్రెస్ టోపీ పెట్టుకోవాల్సి వచ్చింది. తనకు టిక్కెట్ ఖాయమని తేలడంతో ఆయన గత రెండు నెలలుగా నియోజకవర్గంలో ముమ్మరంగా తిరుగుతున్నారు.
ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ అభ్యర్ధి ఎంపికపై ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. ఆ పార్టీ నేత చినమిల్లి సత్యనారాయణ పోటీ చేయడానికి వెనుకాడుతున్నారు. ఆయన నిర్ణయం మారకపోతే బిసి వర్గాలకు చెందిన అభ్యర్ధికి ఇక్కడ అవకాశం లభించగలదని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్న బొమ్మిడి నాయికర్ బిసి వర్గాలనుంచి టిడిపి నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు ఈ నియోజకవర్గంపై కొంత పట్టు సాధించారు. జగన్ ఓదార్పుయాత్రలో వచ్చిన స్పందన కూడా ఆ పార్టీకి నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది.