రజనీ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్న అభిమానులు!
posted on Dec 30, 2020 @ 10:32AM
తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై వెనక్కి తగ్గిన సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఆయన అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం మూడేండ్లుగా ఎదురు చూస్తున్న అభిమానులు.. రజనీ ప్రకటనతో షాకయ్యారని తెలుస్తోంది. పార్టీ లేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా తమ ఆరాధ్య హీరో రజనీ కాంత్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. రాజకీయ పార్టీ పెట్టడం లేదని రజనీకాంత్ ప్రకటించిన వెంటనే.. వందలాది మంది ఆయన అభిమానులు పోయెస్ గార్డెన్ కు చేరుకుని, అక్కడ రోడ్డుపై కూర్చుని ధర్మా చేశారు. తిరుచ్చిలో అభిమానులు ఆగ్రహంతో తమ అభిమాన నేత దిష్టిబొమ్మను, అప్పటికే కట్టి ఉంచిన బ్యానర్లను దగ్ధం చేశారు. కన్యాకుమారి, మధురై, విల్లుపురం, కోయంబత్తూరు, వేలూరు తదితర ప్రాంతాల్లోనూ రజనీ అభిమానులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో తమిళ రాజకీయాల్లో కొంత శూన్యత వచ్చింది. అదే సమయంలో రాజకీయాల్లోకి రావాలని రజనీకాంత్ పై ఒత్తిడి పెరిగింది. దీంతో 2017 డిసెంబర్ 31న రాజకీయ పార్టీపై ప్రకటన చేశారు రజనీకాంత్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. రజనీకాంత్ రాజకీయ ప్రకటనతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి రజనీ అంటూ హడావుడి చేశారు. తర్వాత మూడేళ్లు గడిచినా పార్టీ ఏర్పాటుపై పురోగతి లేకపోవడంతో అభిమానులు మళ్లీ ఢీలా పడ్డారు. గత నవంబర్ 30న రజనీ మక్కల్ మండ్రం సభ్యులతో చర్చించి కొత్త పార్టీపై మరోసారి ప్రకటన చేశారు భాషా. డిసెంబర్ 31 పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు. దీంతో మరోసారి సంబరాలు చేసుకున్నారు రజనీకాంత్ అభిమానులు. డిసెంబర్ 31 పండుగ చేసుకునేలా ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలోనే రాజకీయ పార్టీ లేదనే ప్రకటన రావడంతో రజనీకాంత్ అభిమానులు షాకయ్యారు. అందుకే తాము ఎంతగానే ఆరాధించే హీరో ఫోటోలనే ధ్వంసం చేస్తున్నారని చెబుతున్నారు.