తప్పుడు వైద్యంతోనే కరోనాలో మార్పులు ?
posted on Dec 30, 2020 @ 10:49AM
ఏడాది దాటినా కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ప్రపంచ దేశాలను ఆగమాగం చేసిన వైరస్.. తాజాగా రూపు మార్చుకుని మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బ్రిటన్ లో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా స్ట్రెయిన్ .. అక్కడి నుంచి చాలా దేశాలకు పాకేసింది. మన దేశంలోనూ మంగళవారం వరకే 20 కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. కొత్త కరోనాతో ప్రపంచ దేశాల్లో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి. కొత్త కరోనాతో ఎక్కువ ప్రమాదం లేదని వైద్య నిపుణులు చెబుతున్నా.. అది సోకే వేగమే ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. వైరస్ లో ఇలాంటి జన్యుమార్పులకు కారణం తప్పుడు వైద్యమేనని భారత వైద్య పరిశోధన మండలి చెబుతోంది. కరోనాకు అందిస్తున్న తప్పుడు వైద్యం వల్లే వైరస్ జన్యు పరంగా ఉత్పరివర్తనం చెందుతోందని, లేని చికిత్సలు చేయడం వల్లే మార్పులు జరుగుతున్నాయని ఐసీఎంఆర్ స్పష్టం చేస్తోంది.
బ్రిటన్ కరోనా స్ట్రెయిన్ కూడా తప్పుడు వైద్యం వల్ల వచ్చిందేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ చెప్పారు. మామూలుగా వైరస్ లో మార్పులు జరుగుతూనే ఉంటాయని, కానీ బ్రిటన్ వైరస్ విషయంలో మాత్రం వేగంగా వ్యాపించడమే కలవరపెడుతోందని అన్నారు. తప్పుడు చికిత్సలతో వైరస్ మీద రోగనిరోధక ఒత్తిడి పెరగడం వల్లే మార్పులు జరుగుతున్నాయన్నారు. వాతావరణ పరిస్థితులే మహమ్మారిలో ఉత్పరివర్తనాలకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నా.. శాస్త్రీయత లేని వైద్యం చేసి వైరస్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా మార్పులు జరుగుతాయన్నారు. వైద్యులు, శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ.
టీకాతో కరోనా రోగనిరోధకశక్తి పెరుగుతుందని, కాబట్టి వ్యాక్సినేషన్ను కొంచెం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని భార్గవ చెప్పారు. కరోనాకు ప్రస్తుతం తయారు చేస్తున్న వ్యాక్సిన్లన్నీ వైరస్లోని ఎస్ ప్రొటీన్ను లక్ష్యంగా పనిచేసేవనని, కొన్ని ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లూ ఉన్నాయని చెప్పారు. అవన్నీ ప్రస్తుతానికి వైరస్ మీద బాగానే పనిచేస్తున్నాయని ఆయన వివరించారు.వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్నందున కరోనా స్ట్రెయిన్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు ఐసీఎంఆర్ డైరెక్టర్.