మోడీజీ.. రైతులతో యుద్ధం చేస్తున్నారా?
posted on Feb 2, 2021 @ 3:39PM
ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. కేంద్ర సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులు.. భారీగా ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నారు. రైతుల నిరసన, పోలీసుల బందోబస్తుతో ఢిల్లీ సరిహద్దులు కోటలుగా మారుతున్నాయి. ప్రధాన రహదార్లపై ఆరు-ఏడు అంచెల బారీకేడ్లు వేస్తున్నారు. రోడ్లపై మేకుల ఉచ్చులు, ముళ్లకంచెలు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక రోడ్లు మూసివేశారు. జనవరి 26 విధ్వంసం అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎర్రకోట ఘటనతో రైతులను నిరసన ప్రదేశం నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. ఢిల్లీ-హర్యానా, ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లో భద్రతా బలగాలను భారీగా మోహరించింది.
ఢిల్లీ సరిహద్దుల్లో కాంక్రీట్ భారీకేడ్ల నిర్మాణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. గోడలు కాదు, వంతెనలు కట్టండంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'జీవోఐ (గవర్న్‌మెంట్ ఆఫ్ ఇండియా), బ్రిడ్జిలు నిర్మించండి, గోడలు కాదు' అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ సరిహద్దులో పోలీసుల ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న కాంక్రీట్ భారీకేడ్ల చిత్రాలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు రాహుల్ గాంధీ. ఈ ట్వీట్‌కు ముందు మోడీ ప్రభుత్వానికి చెబుతున్నట్లుగా ‘భారత ప్రభుత్వం’అని రాసుకొచ్చారు.
రైతులు నిరసనలు తెలుపుతున్న ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు, పోలీసు బలగాల మోహరింపుపై తీవ్రంగా స్పందించారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఉద్యమం చేస్తున్న రైతులపై ప్రధాని మోడీ యుద్ధం చేస్తున్నారా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. 'గౌరవనీయులైన ప్రధానమంత్రి గారూ.. రైతులతో మీరు యుద్ధం చేస్తున్నారా?' అంటూ ప్రియాంక మంగళవారంనాడు ట్వీట్ చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించిన వీడియోను కూడా ప్రియాంక గాంధీ షేర్ చేశారు.
తమపై పోలీసులు వేధింపులు ఆపేవరకూ ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొనమని రైతు సంఘాలు స్పష్టంచేశాయి. పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్న రైతులను విడుదల చేసేవరకూ ప్రభుత్వంతో భేటీ అయ్యే ప్రసక్తే లేదని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. వ్యవసాయ చట్టాలపై ఉద్యమిస్తోన్న తమపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి వేధింపులు ఆపేంతవరకు ప్రభుత్వంతో చర్చలకు దూరంగా ఉండాలని రైతు సంఘాలు నిశ్చయించుకున్నట్లు ఎస్‌కేఎం ప్రకటించింది. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడంలో భాగంగా ఫిబ్రవరి 6వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్భందించాలని పిలుపునిచ్చింది.