గొల్లలగుంట బాధిత కుటుంబానికి ఎస్‌ఈసీ పరామర్శ
posted on Feb 2, 2021 @ 3:53PM
పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో బిజిబిజీగా ఉన్న ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన తూర్పు గోదావరి జిల్లా గొల్లలగుంట సర్పంచ్ అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఎస్‌ఈసీ గొల్లలగుంటలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సత్వర, నిష్పాక్షిక విచారణతోనే బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. రాజకీయాలు, తప్పులు ఎంచే సమయం ఇది కాదని ఎస్‌ఈసీ వివరించారు. విషయాన్ని రాజకీయం చేయకూడదని, మానవతా దృక్పథంతో చూడాలన్నారు.
సోమవారం అనుమానాస్పద స్థితిలో గొల్లలగుంట సర్పంచ్ అభ్యర్థి భర్త శ్రీనివాస్‌రెడ్డి మృతిచెందారు. ఆదివారం అర్ధరాత్రి కిడ్నాప్ కు గురైన శ్రీనివాస్‌రెడ్డి సోమవారం సాయంత్రం పొలంలో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ఈ వార్తను తాను ఓ వార్త పత్రికలో చదివానని.. ఘటనకు గల కారణాలు, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పరిశీలిస్తానని విశాఖ పర్యటనలో ఉన్న ఎస్‌ఈసీ మంగళవారం ఉదయం తెలిపారు. సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు.. కాదని కుటుంబ సభ్యులు చెబుతున్న నేపథ్యంలో గొల్లలగుంటలో పర్యటించి అనంతరం జిల్లా అధికారులతో ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహిస్తానని ఎస్‌ఈసీ చెప్పారు. అన్నట్లుగానే గొల్లలగుంటకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.
నిందితులు ఎంతటి వారైనా తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ప్రతిదీ రాజకీయం చేయడం తగదని సూచించారు. పోస్టుమార్టం పారదర్శకంగా జరిపిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. గొల్లగుంట పంచాయతీ ఎన్నికల అంశాన్ని తర్వాత పరిశీలిస్తామని చెప్పారు. జగ్గంపేట సీఐ సురేష్‌బాబు, ఎస్‌ఐ రామకృష్ణపై చర్యలకు ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరిని వీఆర్‌కు పంపాలని ఎస్‌ఈసీ ఆదేశించారు. ఎస్పీ స్వయంగా కేసు దర్యాప్తు చేయాలని ఎస్‌ఈసీ కోరారుజిల్లాలో ఏర్పాట్లన్నీ బాగున్నాయని నిమ్మగడ్డ కితాబు ఇచ్చారు.