పంజాబ్, ఢిల్లీ ఐపీఎల్ మ్యాచ్ నిలిపివేత...భద్రతా దృష్ట్యా మ్యాచ్ రద్దు
posted on May 8, 2025 @ 10:06PM
ధర్మశాల వేదికగా పంజాబ్, ఢిల్లీ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ రద్దైంది. పాక్ అనూహ్య దాడుల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రద్దు చేసినట్లు తెలుస్తోంది. గ్రౌండ్ వదిలి వెళ్లాలని ప్రేక్షకులకు అధికారులు ఆదేశించారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ స్థానికంగా బ్లాక్ అవుట్ విధించినట్లు సమాచారం. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇవ్వనున్నారు.భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్ము కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలలో బ్లాక్ అవుట్ వాతావరణం ఏర్పడింది. జమ్ము విమానాశ్రయంతో పాటు పలు ప్రాంతాలను పాకిస్థాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.
డ్రోన్ దాడులు జరుగుతున్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. రాజస్థాన్ లోని జైసల్మేర్‌లో పాకిస్థాన్ డ్రోన్‌ను భారత సైన్యం కూల్చివేసింది. అమృత్‌సర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకునేందుకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సహాయం కోసం 0172-2741803, 0172-2749901 నంబర్లలో రెవెన్యూ విపత్తు నిర్వహణ పర్యవేక్షణ కేంద్రాన్ని సంప్రదించవచ్చని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.