పుల్వామా దాడి మోడీ సర్కార్ వైఫల్యమే.. సత్యాపాల్ మాలిక్
posted on Apr 15, 2023 @ 11:09AM
ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా తీసేసి పెద్ద తప్పు చేశారు. ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని తప్పు సరిదిద్దుకోవాలి. విపక్షాలన్నీ ఐక్యంగా నిలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ విజయం అనుమానమే. ఈ మాటలన్నది ఎవరో కాదు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఆఖరి గవర్నర్ గా పని చేసిన సత్యపాల్ మాలిక్. ఆయన గవర్నర్ గా ఉన్న సమయంలోనే పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆ దాడి పూర్తిగా మోడీ సర్కార్ వైఫల్యమేనని సత్యపాల్ మాలిక్ ఒక ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. కేంద్ర ప్రభుత్వం కాళ్ల కింద భూమి కదిలిపోయే విషయాలను వెల్లడించారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడిని మోడీ సర్కార్ ఎన్నికల లబ్ధికి ఉపయోగించుకుందన్నారు. ఆ సమయంలో కేంద్ర హోం మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ ఉన్నారనీ, తమ జవాన్లను తరలించడానికి ఎయిర్‌క్రాఫ్ట్ కావాలని సీఆర్పీఎఫ్ కోరగా, హోం శాఖ తిరస్కరించిందని చెప్పారు. రక్షణపరంగా సీఆర్పీఎప్ జవాన్లు ప్రయాణించిన మార్గం ఎంత మాత్రం సురక్షితం కాదని తెలిసినా రాజ్ నాథ్ సింగ్ పట్టించుకోలేదన్నారు. పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన తర్వాత తనకు మోడీ ఫోన్ చేసి ఈ విషయంలో నోరెత్తవద్దన్నారన్నారు. ఆ వెంటనే జాతీయ భద్రతా సలహాదారు కూడా తనకు ఫోన్ చేసి మౌనంగా, నిశ్శబ్ధంగా ఉండాలన్నారనీ, అప్పటి కానీ తనకు ఈ దాడి ద్వారా బీజేపీ ప్రభుత్వం ఎన్నికలలో లబ్ధిని ఆశిస్తోందని తెలియలేదన్నారు. పుల్వామా దాడి ఇంటెలిజెన్స్ ఘోర వైఫల్యం అని సత్యాపాల్ మాలిక్ చెప్పారు.
పాకిస్థాన్ నుంచి 300 కిలోల ఆర్డీఎక్స్తో వచ్చిన ఒక వాహనం దాదాపు పది రోజుల పాటు జమ్ముకశ్మీర్ రోడ్లపై యథేచ్ఛగా తిరిగినా గుర్తించలేకపోవడం కంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏముంటుందని సత్యాపాల్ మాలిక్ అన్నారు. దేశంలోని ముస్లింలపై ప్రధాని మోదీ, ఆయన మంత్రులు వ్యవహరిస్తున్న తీరు ఎంతమాత్రం సమర్థనీయం కాదని సత్యాపాల్ మాలిక్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ముస్లింలపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసే మంత్రులను కట్టడి చేయడానికి మోడీ ఇసుమంతైనా ప్రయత్నం చేయడం లేదని సత్యపాల్ మాలిక్ చెప్పారు.
ఇంకా ఆదానీ వ్యాపార అక్రమాలపై నోరెత్తిన రాహుల్ గాంధీ విషయంలో మోడీ సర్కార్ అత్యంత దారుణంగా వ్యవహరించిందన్నారు. అదానీ వ్యవహారంలో దేశ వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో మోడీ ర్కార్ ప్రతిష్ట దిగజారిందన్న సత్యపాల్ మాలిక్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విపక్షాలు ఐక్యంగా నిలబడితే బీజేపీకి విజయం సులభ సాధ్యం కాదని చెప్పారు. ఇక అదానీ అక్రమాలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం మోడీ సర్కార్ చేసిన తప్పుని అభిప్రాయపడ్డారు. అదానీ విషయంలో రాహుల్ సంధించిన ప్రశ్నలకు మోడీ వద్ద సమాధానం లేకపోవడం వల్లనే రాహుల్ ను మాట్లాడనీయలేదని ఆరోపించారు.
రాష్ట్రాలలో గవర్నర్లుగా ఏ మాత్రం స్థాయి, ప్రమాణాలు లేని వ్యక్తులను మోడీ సర్కార్ నియమిస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
అవినీతి విషయంలో మోడీకి ఇసుమంతైనా పట్టింపు లేదన్న సత్యపాల్ మాలిక్ తన అనుయాయులకు ప్రయోజనం చేకూర్చడానికి ఎంతకైనా తెగిస్తారన్నారు. తాను జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న సమయంలో రాష్ట్రంలో రిలయెన్స్ ఇన్సూరెన్స్, హైడ్రో ఎలక్ట్రిక్ పథకాలను అనుమతి ఇవ్వాలని కోరారనీ, అందుకు తాను నిర్ద్వంద్వంగా తిరస్కరించాననీ వెల్లడించారు. దీంతో అప్పటికి బీజేపీలో, ఆర్ఎస్ఎస్ లో కీలకంగా వ్యవహరిస్తున్న రామ్ మాధవ్ ఓ రోజు ఉదయమే తన వద్దకు వచ్చి వాటిని అనుమతి ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెచ్చినట్లు వివరించారు. అయితే తాను అందుకు అంగీకరించలేదనీ, తప్పు చేయడానికి తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశాననీ చెప్పారు. ఆ పథకాలకు అనుమతి ఇస్తే రూ.300 కోట్లు ఇస్తామని కొందరి నుంచి ఆఫర్ వచ్చిందన్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను రద్దు చేసి ప్రధాని మోడీ పెద్ద తప్పు చేశారని, ఈ విషయంలో ఆయనను కొందరు తప్పుదోవ పట్టించారన్న సత్యపాల్ మాలిక్ ఇప్పటికైనా ఆ తప్పు దిద్దుకోవాలని మోడీకి సూచించారు.