కాంగ్రెస్ కు పవార్ బిగ్ షాక్
posted on Apr 15, 2023 @ 9:55AM
ఓ వంక జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఏకం చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అలాగే జేడీయు అధినేత, బీహార్ ముఖ్యమత్రి నితీష్ కుమార్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్... ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్న సమయంలో ఎన్సీపీ అధినేత శరద పవార్ విపక్ష పార్టీలకు ముఖ్య్మగా కాంగ్రెస్ పార్టీకి సర్ప్రైజ్ షాక్ ఇచ్చారు. జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత గురించి ఖర్గే, రాహుల్ గాంధీతో చర్చించిన పవార్, 24 గంటలు తిరక్కుండానే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ 45 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు.
నిజానికి ఇటీవల ఒకటి రెండు సందర్భాలలో శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ విపక్షాల ఉమ్మడి నిర్ణయాలకు దూరంగా ఉంటోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అధికార బీజేపీ దగ్గరవుతున్న సంకేతాలు స్పష్ట మవుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా అదానీ వ్యవహారంలో జేపీసీ కోసం విపక్ష పార్టీలన్నీ ముఖ్యంగా కాంగ్రెస్ అనుకూల విపక్షాలన్నీ పట్టు పట్టిన సందర్భంలో పవార్ అందుకు భిన్నమైన స్టాండ్ తీసుకున్నారు. అలాగే రాహుల్ గాంధీ సావార్కర్ ను చులక చేస్తూ చేసిన వ్యాఖ్యల విషయంలోనూ పవార్ రాహుల్ గాంధీని నోరు అదుపులో పెట్టుకునేలా కట్టడి చేయాలని సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేకు సూచించినట్లు వార్త లొచ్చాయి. మరోవంక పవర్ బంధువు, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బీజేపీలో చేరుతున్నట్లు మహారాష్ట్ర మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరాఠా యోధుడు శరద్ పవార్ అడుగులు అటుగా పడుతున్నాయా అనే అనుమానాలకు బలం చేకూరుతోంది.
సరే ఆ పరిణామాలకు ఎన్సీపీ తీసుకున్న తాజా నిర్ణయానికి ప్రత్యక్ష సంబంధం ఉన్న లేకున్నా కర్ణాటక బరిలో ఎన్సీపీ అది కుడా ఏకంగా 45 స్థానల్లో బరిలో దిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మరింతగా చీలి బీజేపీ లబ్ధి పొందుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, జేడియూ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. మరోవంక ఎంఐఎం కూడా పోటీకి రెడీ అవుతోంది. ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించారు. అలాగే సిపిఎం కుడా పరిమితంగా నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించింది. అలాగే, భారత రాష్ట్ర సమితి ఇప్పటికి ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ పోటీ చేసే అవకాశాలను కొట్టివేయలేమని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
ఈ తరుణంలో ఎన్సీపీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నామని చేసిన ప్రకటన సహజంగానే విపక్ష కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఇటీవలే జాతీయ హోదా కోల్పోవడంతో ఆ హోదా తిరిగి పొందేందుకు అనివార్య పరిస్థితుల్లో కర్ణాటక ఎన్నికల బరిలోకి దిగాల్సి వస్తోందని ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో మరాఠీ ప్రజలు ఎక్కువగా ఉన్న చోట ఎన్సీపీ పోటీ చేయాలని అనుకుంటోంది. మహారాష్ట్ర ఏకీకరణ్ సమితితో కలిసి ఎన్సీపీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అయితే చివరకు కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఎన్సీపీ పరిమిత స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించవచ్చని ఇందుకు సంబంధించిన బేరసారాల కోసమే పవార్ బాంబు పేల్చారని కొందరు భావిస్తున్నా.. ఈ దశలో అది అయ్యేపని కాదని అంటున్నారు.
అదీగాక గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుకు ప్రయత్నించి అభాసు పాలైన నేపథ్యంలో పవార్ మరోమారు ఆలాంటి తప్పు చేయరని, అంటున్నారు. అయితే కారాణాలు ఏవైనా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎన్సీపీ ఎంట్రీ ఇవ్వడం కాంగ్రెస్ కు బిగ్ షాక్ అనడంలో సందేహం లేదు. జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతకు కూడా కర్ణాటక పరిణామాలు లిట్మస్ టెస్ట్ గా నిలుస్థాయని భావిస్తున్న తరుణంలో ఎన్సీపీ పోటీ నిర్ణయం జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతకు భంగమేనన్న అభిప్రాయం వ్యక్త మౌతోంది.