ఢిల్లీ ప్రొఫెసరు గిలానీ అరెస్టు!
posted on Feb 16, 2016 @ 9:48AM
ఢిల్లీ విశ్వవిద్యాలయపు మాజీ ప్రొఫెసరు గిలానీని ఇవాళ తెల్లవారుజామున అరెస్టు చేశారు. దేశవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించినందుకుగాను ఆయన మీద తీవ్రమైన కేసులను నమోదు చేశారు. ఈ నెల 10వ తేదీన దిల్లీలోని ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఒక సమావేశాన్ని గిలానీ పేరు మీద ఏర్పాటు చేశారు. ఒక సాధారణ సమావేశం అంటూ మొదలైన ఈ కార్యక్రమంలో అఫ్జల్‌గురుకి అనుకూలంగా, ఇండియాకు వ్యతిరేకంగా ప్రసంగాలు సాగాయి. ఇదంతా కూడా గిలానీ కుట్రే అని పోలీసులు భావిస్తున్నారు. ఉన్నత విద్యావంతుడైన గిలానీకి ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. 2001లో పార్లెమంటు మీద జరిగిన దాడిలో గిలానీ చాలా ప్రముఖమైన పాత్రను పోషించారని ఆరోపణలు వచ్చాయి. అయితే సరైన సాక్ష్యధారాలు లేకపోవడంతో ఆయనను విడుదల చేయడం జరిగింది. గిలానీ మొదటి నుంచీ కూడా తన విద్యార్థులలోనూ, తోటివారిలోనూ భారతదేశానికి వ్యతిరేకమైన భావాలను ప్రోత్సహించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే గిలానీ ఈ ఆరోపణలను ఎన్నడూ పట్టించుకోలేదు. స్వేచ్చగా మాట్లాడటం తన హక్కు అనీ, బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నవారంతా హాయిగా తిరుగుతుంటే... తమలాంటి వారిని వేధించడం సమంజసం కాదు అని ప్రతివిమర్శ చేసేవారు.