ఇందిరమ్మను తలపించిన ప్రియాంక గాంధీ
posted on May 9, 2023 6:59AM
ప్రియాంక వాద్రా తెలంగాణ పర్యటన విజయవంతమైంది. ఆమె మాట, ఆమె తీరు మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీని తలపించాయి. ప్రియాంక ప్రసంగం యావత్తూ సూటిగా సుత్తి లేకుండా సాగింది. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, తప్పిదాలను నిర్మొహమాటంగా ఎండగట్టారు. సోమవారం (మే 8) హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ యువ సంఘర్షణ సభకు ప్రియాంక వాద్రా హాజరయ్యారు. ఆమె తన ప్రసంగాన్ని జై బోలో తెలంగాణ అంటూ ఆరంభించారు.
ఎండలు మండి పోతున్నా సభకు ప్రేమాభిమానాలతో సభకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు అని మొదలు పెట్టారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతా చారిని ప్రస్తావించి కీర్తించారు. మిత్రులారా అంటూ తెలుగులో సంబోధించారు. తెలంగాణ సాకారం కోసం అమరవీరులు, విద్యార్థుల త్యాగాలు ఎనలేనివని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఇక్కడివారు ఉద్యమించారని తెలిపారు. ఈ సభలో ప్రియాంక కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు.యువత బలిదానాల వల్లే తెలంగాణ సాకారమైందన్నారు. దేశం కోసం తన కుటుంబం కూడా త్యాగాలు చేఃసిందని చెప్పారు.
తన నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారని చెప్పారు. తమ కుటుంబానికి త్యాగాల విలువ తెలుసు అని ఆమె అన్నారు. తెలంగాణ కోసం వేలాది మంది బలిదానం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం వారి త్యాగాలను ఏ మాత్రం గుర్తించడం లేదు అని ఆమె అన్నారు. ఇక తన తల్లి సోనియా తెలంగాణ ఇచ్చారనీ, సోనియా గాంధీ అధికారం కోరుకోకుండా తెలంగాణా ఇచ్చారని అన్నారు. సోనియా గాంధీకి తెలంగాణా పట్ల ఉన్న ప్రేమ అభిమానానికి ఇది నిదర్శనం అని అన్నారు.అందుకే ఆమెను ఇక్కడి వారు తల్లిగా భావిస్తున్నారనీ గుర్తు చేసుకున్నారు. అత్యంత కఠినమైన తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకుని సోనియా తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేశారని ప్రియాంక వాద్రా చెప్పారు. అయితే తెలంగాణలో ప్రస్తుత కేసీఆర్ హయాంలో జాగీర్దార్ల పాలన సాగుతోందని విమర్శించారు. ఇంటింటికీ ఉద్యోగం అన్న హామీని నెరవేర్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం కాదని ప్రియాంకా వాద్రా అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిన టీఎస్ పీఎస్సీలో ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. ఉద్యోగాల కల్పన అటకెక్కించారు... నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదంటూ విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలు ఏర్పాటు కావడంలేదు కానీ, ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుతో విద్యార్థులను దోచుకుంటున్నారని విమర్శించారు. జనం తనను నానమ్మ ఇందిరలా ఉన్నావంటున్నారనీ, ఆ మాటలు నాలో బాధ్యతను పెంచుతున్నాయనీ అన్నారు. తెలంగాణ ప్రజలు వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికల వేళ విజ్ఞతతో వ్యవహరించకపోతే అంతిమంగా నష్టపోయేది ప్రజలేనని చెప్పారు. ఈ సభలో ఆమె యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని చెప్పిన ప్రియాంక గాంధీ.. అలా నెరవేర్చకపోతే కాంగ్రెస్ ను పక్కన పెట్టేయండి.. తనతో ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరినీ నిలదీయండి అని ప్రియాంకా గాంధీ అన్నారు. ఉద్యోగ నియామకాల కోసం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి అందిస్తాం, యువతీయువకుల కోసం ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తామన్నారు.
తెలంగాణా అన్నది నేల కాదని తల్లి అని ఆమె అన్నారు. తెలంగాణాలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం చూసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ప్రియాంకా గాంధీ అన్నారు. తాను ఇందిరమ్మ మనవరాలిననీ తప్పుడు హామీలు ఇవ్వనని ప్రియాంక గాంధీ అన్నారు. తన ప్రసంగంలో అనేకసార్లు ఇందిరమ్మను ప్రియాంక తలచుకున్నారు. ప్రియాంక ప్రసంగానికి జనం నుంచి మంచి స్పందన వచ్చింది. మొత్తం మీద ప్రియాంక వాద్రా హైదరాబాద్ సభ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.