బ్రిటన్ యువరాణి చనిపోయింది! జనంలో ఆసక్తి మాత్రం చావటం లేదు!
posted on Jun 13, 2017 @ 4:23PM
ఆధునిక ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు గ్రేట్ బ్రిటన్. అక్కడ్నుంచే డెమోక్రసీ ప్రపంచమంతా వ్యాపించింది. రాజ్యాలు, రాజుల అంతం ఆరంభమైంది. కాని, విచిత్రంగా బ్రిటన్ లో ఇప్పటికీ మహారాణి వుంటుంది. మహారాజుల వంశమూ వుంటుంది. వాళ్ల ప్యాలెస్ , ఆ ప్యాలెస్ లోని రాజులు, రాణుల జీవితాలంటే జనం పడి చచ్చిపోతారు!
శతాబ్దాల చరిత్ర కలిగిన బ్రిటన్ రాజవంశపు బకింగ్ హ్యామ్ పాల్యెస్ లో అత్యంత వివాదాస్పదమైన యువరాణి… డయాన! ఒక కార్ యాక్సిడెంట్లో విషాదాంతమైన ఆమె… జీవితకాలం పాటూ గొడవల్లో మునిగిపోయింది. ఆమెను బ్రిటన్ యువరాజు గ్రాండ్ మ్యారేజ్ సెర్మనీలో ప్రపంచం మొత్తం సాక్షిగా చేపట్టాడు! కాని, తరువాత వారిద్దరూ ఏ ఒక్క రోజూ సుఖంగా, సంతోషంగా వుండలేదు. చివరకు, డయానా ఆ రాజవంశం, రాజభోగాలు, రాచరిక కట్టుబాట్లు ఏవీ వద్దనుకుని డైవోర్స్ తీసుకుని బయటకొచ్చేసింది. తరువాత కొన్నేళ్లకు బ్రిటన్ పాపరాజీ మీడియా వెంటాడుతుంటే బాయ్ ఫ్రెండ్ తో కలిసి తప్పించుకునే తొందర్లో యాక్సిడెంట్ కి గురై చనిపోయింది!
అప్పుడెప్పుడో అర్ధాంతరంగా అంతమైపోయిన యువరాణి డయానా అంటే బ్రిటన్ జనానికి ఇప్పటికీ పిచ్చి. ఆమె గురించి ఏం చెప్పినా పనిగట్టుకుని, పనులు మానేసి వింటారు. అందుకే, తాజాగా … డయానా , హర్ ట్రూ స్టోరీ అనే మరో పుస్తకం వదిలాడు ఓ రచయిత. అందులో బయటపెట్టిన విషయాలు ఇప్పుడు బ్రిటీషర్లని షాక్ కి గురిచేస్తున్నాయి. అసలు డయానా పెళ్లైన కొద్ది రోజులకే ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. చేతి మణికట్ల దగ్గర కోసుకుని ప్రాణాలు తీసుకోవాలని భావించిందట. ఇదంతా ఆమె 1990లలో ఒక ఫ్రెండ్ సాయంతో రికార్డ్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డింగ్స్ పుస్తక రచయిత బయటపెట్టాడు!
పైకి హంగూ, ఆర్భాటంతో కనిపించే రాచ కుటుంబీకుల జీవితాలు బ్రిటన్లో మాత్రమే కాదు చాలా చోట్ల ఒత్తిళ్లతోనే వుంటాయి. డయానా వైవాహిక జీవితం కూడా అంతే. బ్రిటన్ యువరాజును పెళ్లాడిన ఆమె అనుక్షణం అతడి లవ్వర్ క్యామిల్లా మీద అనుమానంతోనే సతమతం అయిపోయింది. స్వయంగా డయానానే యువరాజు ప్రేమికురాలైన క్యామిల్లా పట్ల తన ఫీలింగ్స్ గురించి వివరించింది. కలలో కూడా ఆమెకు తన భర్త క్యామిల్లాకు ఫోన్ చేసినట్టు కనిపించేదట! ఆ ఒత్తిడే చివరకు డైవోర్స్ దాకా వెళ్లింది.
యువరాణి డయానా గురించిన తాజా చర్చ… ఆమె చనిపోయినా బ్రిటీషర్లకు ఆమెపై వున్న ఆసక్తి మాత్రం చావలేదని నిరూపిస్తోంది!