వెంటిలేటర్ పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ... పరిస్థితి ఆందోళనకరం!
posted on Aug 11, 2020 @ 9:51AM
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలుసుకున్న వైద్యులు గత రాత్రి ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేసారు. ఆయనకు చేసిన శస్త్రచికిత్స విజయవంతమైనా, అయన 84 సంవత్సరాల వయసు రీత్యా మరో పక్క కరోనా వైరస్ కారణంగా ఇతర అవయవాల పనితీరు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని డాక్టర్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై ఉంచామని, ప్రత్యేక వైద్య బృందం అనుక్షణం పరిశీలిస్తోందని ఢిల్లీలోని సైనిక ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
దీంతో ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం కుదుటపడాలని, ఆయన త్వరగా కోలుకోవాలని ఇటు ప్రజలు అటు పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా కోరుకుంటున్నారు. ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని, ఆయన త్వరగా కోలుకోవాలని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్, ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆకాంక్షించారు.
2012 నుంచి 2017 మధ్యకాలంలో రాష్ట్రపతిగా సేవలందించిన ప్రణబ్... నిన్న ఉదయం తనకి కరోనా పాజిటివ్ గా తేలిందని, దీంతో గత రెండు వారాలుగా తనను కలిసినవారంతా సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉండి కరోనా పరీక్షలు కూడా చేయించుకోవాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరిన సంగతి తెలిసిందే. చాలాకాలం పాటు ఆయన కాంగ్రెస్ పార్టీకి తలలో నాలుకలా వ్యవహరించారు. అంతే కాకుండా ఆయన భారత ఆర్థిక వ్యవస్థపై, జాతి నిర్మాణంపై అనేక పుస్తకాలు రచించి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. 2019 లో ప్రణబ్ భారత్ రత్నను, 2008లో పద్మ విభూషణ్ అవార్డును, 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును స్వీకరించారు.