బీజేపీ పై కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్.. బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
posted on Aug 11, 2020 @ 10:27AM
ఏపీ మంత్రి కొడాలి నాని తాజాగా బీజేపీ పైన చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఒక న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొడాలి నాని మాట్లాడుతూ.. భారత్ లో పుట్టిన కరోనా ఒకటుందని, అదే బీజేపీ అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అంతే కాకుండా అది పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ను, కమ్యూనిస్టులను కలిపి తినేస్తోందని, అలాగే త్రిపురలో కాంగ్రెస్‌ను తినేస్తోందని మంత్రి నాని వ్యాఖ్యానించారు. బీజేపీ అనే కరోనాకి ఇది అది అని ఏమీ లేదని, అది తగులుకుంటే అన్నిటిని తినేస్తోందని బీజేపీపై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అది ఇప్పటికే వచ్చిందని, జనం అంతా బాగా మాస్క్‌లు పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
అయితే మంత్రి కొడాలి నాని బీజేపీ పై తాజాగా చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ మండిపడింది. కొడాలి నాని బీజేపీని కరోనాతో పోలుస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేవైఎమ్ ప్రకటించింది. త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో ఒక గొప్ప శక్తిగా తమ పార్టీ ఐన బీజేపీ ఎదిగిందని ట్వీట్ చేసింది. అంతే కాకుండా అవినీతి, కుటుంబ పాలనతో ఆంధ్రప్రదేశ్‌ను పట్టిపీడిస్తున్న టీడీపీ, వైసీపీ లాంటి ప్రాంతీయ వైరస్‌లకు దేశవ్యాప్త వ్యాక్సిన్ బీజేపీ అని కూడా ట్వీట్ చేసింది.