సీఎం తేజస్వికి శుభాకాంక్షలు! ఫలితాలు రాకముందే హోరెత్తిన ట్విట్టర్
posted on Nov 9, 2020 @ 3:34PM
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాక ముందే.. మహా గట్ బంధన్ ఎన్నికల సారథి, ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్ క్రేజీ అమాంతం పెరిగిపోయింది. బిహార్ లో ఆర్జేడీ కూటమిదే అధికారమని దాదాపు అన్ని సర్వేలు తేల్చి చెప్పడంతో.. ఆ కూటమి కార్యకర్తల అనందానికి అంతే లేకుండా పోయింది. ఇప్పటికే గెలుపుపై ధీమాగా ఉన్న ఆర్జేడీ కార్యకర్తలకు.. ఫలితాలకు ఒక రోజు ముందు తేజస్వి యాదవ్ పుట్టినరోజు కావడం డబుల్ ధమాకాగా మారింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అర్జేడీ కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు.
అయితే తమ యువ నేత తేజస్వి యాదవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సీఎం తేజస్వి అని పోస్టులు చేశారు ఆర్జేడీ కార్యకర్తలు. పాట్నాలోనూ 'ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ భారీగా బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. తేజస్వికి విషెష్ చెప్పేందుకు భారీగా తరలివచ్చిన నేతలు కార్యకర్తలు, అభిమానులు .. సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు.
ట్విట్టర్ లో తేజస్వి యాదవ్ పేరు మార్మోగుతోంది. ఇండియా ట్విట్టర్ ట్రెండింగ్‌లో తేజస్వీ పేరు టాప్ లో నిలిచింది. ఇండియా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌ట్యాగుల్లో తేజస్వీ పేరుతోనే నాలుగు హ్యాష్‌ట్యాగ్‌లు నిలిచాయి. ‘‘ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్’’ హ్యాష్‌ట్యాగ్ అందులో టాప్ లో నిలిచింది. తమ అభిమాన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ముఖ్యమంత్రి కాబోతున్నారనే నమ్మకంతో ఆ శుభాకాంక్షలు కూడా ముందుగానే చెప్పేశారు నెటిజెన్లు.