పొన్నాల కధ రేపటి ఎపిసోడ్ లో
posted on Feb 7, 2013 @ 3:01PM
2009లో జరిగిన సాధారణ ఎన్నికలలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య కేవలం 236 ఓట్ల మెజారిటీతో జనగామ నుండి గెలుపొందారు. అయితే, తెరాసకు చెందిన ఆయన సమీప ప్రత్యర్ధి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పొన్నాల కౌటింగ్ అధికారులను బెదిరించి తనకనుకూలంగా ఫలితాలు ప్రకటింపజేసుకొన్నారని ఆరోపిస్తూ, ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించమంటూ హైకోర్టులో పిటిషన్ వేసారు. ఈ కేసు హైకోర్టు విచారణకొచ్చేసరికి పొన్నాల దాదాపు నాలుగు సం.లు పదవీ కాలం కూడా పూర్తి చేసేసుకొన్నారు. కేవలం మరో ఏడాది మాత్రం మిగిలి ఉన్నఈతరుణంలో, ఈరోజు ఆయన కేసును హైకోర్టు విచారణకు స్వీకరించడంతో తప్పనిసరిగా పొన్నాల కోర్టుమెట్లు ఎక్కవలసి వచ్చింది. దాదాపు రెండు గంటలపాటు ఇరుపక్షాల లాయర్ల మద్య జరిగిన వాదనలు విన్నతరువాత, న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఈ కేసుపై స్టే కోరుతూ పొన్నాల గతంలో సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు, రాష్ట్ర హైకోర్టులో తేల్చుకోవలసిన విషయాన్నీ తన వద్దకు తెచ్చినందుకు కోర్టు ఆయనను మందలించింది. అప్పటికే ఆ కేసు విచారిస్తున్న హైకోర్టు ‘ఈవీయం మెషిన్ల’ను తన అధీనంలో ఉంచుకొంది. ఈ రోజు వాదనలు పూర్తయినందున, బహుశః రేపు హైకోర్టు ఈవీయం మెషిన్లలో రికార్డ్ అయిన ఓట్లను మళ్ళీ లేక్కించమని ఆదేశిస్తే, పొన్నాలకు ఎన్ని ఓట్లు పడిందీ స్పష్టమయిపోతుంది.
ఒకవేళ ఇప్పుడు కూడా 236 ఓట్ల మెజారిటీ ఉన్నట్లు నిరూపితం అయితే పరువలేదు. కాని పక్షంలో, ఆయనకి పదవి పోవడమే కాకుండా, మోసానికి పాల్పడినందుకు, మోసపూరితంగా పదవిలో కొనసాగి రాజ్యాంగ అతిక్రమణకు పాల్పడినందుకు కొత్త కేసులు మెడకు చుట్టుకోక తప్పదు. అదే జరిగితే, ఇంతకాలం ఒక వెలుగు వెలిగిన ఆయనకు, వచ్చే ఎన్నికలకు పోటీ చేసే అవకాశం కూడా కోల్పోవచ్చును.
ఆయన ప్రత్యర్ధి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మీడియావారితో మాట్లాడుతూ , పొన్నాల మోసానికి పాల్పడకపోయి ఉంటే, ఆనాడే మళ్ళీ రీకౌంటిగ్ కు అంగీకరించేవారని, కానీ ఓడిపోయినందునే ఈ విధంగా మోసానికిపాల్పడటమేకాక, ఇంతకాలంలో మంత్రిపదవిలో కొనసాగి మరో తప్పు చేసారని ఆరోపించారు.
ఇంతకీ పొన్నాల దోషా? నిర్దోషా? ఆయన మంత్రి పదవి ఉంటుందా, ఊడుతుందా? దోషి అనితేలితే ఆయన పదవికి రాజీనామా చేస్తారా లేక సుప్రీం కోర్టుకు వెల్లి మిగిలిన ఏడాది కాలం కూడా లాగించేస్తారా? వంటి ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలంటే ‘పొన్నాల ఎన్నిక’ సీరియల్ రేపటి ఎపిసోడ్ వరకు ఎదురు చూడవలసిందే.