ఇక అంత ‘ములాయం’గా ఉండను స్మీ!

 

ఇంతకాలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తున్న సమాజ్ వాదీ పార్టీనేత ములాయం సింగ్ యాదవ్, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోనే మధ్యంతర ఎన్నికలు రానున్నాయని మొన్న అకస్మాత్తుగా ప్రకటించి అన్ని రాజకీయ పార్టీలను ఆశ్చర్యపరిచారు. తన ప్రకటనకు కొనసాగింపుగా మళ్ళీ స్వయంగా ఈ రోజు మరింత వివరణ ఇవ్వడంతో ‘ఆయన ఆవిధంగా ఎందుకు అన్నారని రాజకీయ విశ్లేషకులు కధనాలు అల్లే శ్రమ తప్పింది.

 

ములాయం సింగ్ లక్నోలో మీడియావారితో “అసలు కాంగ్రెస్ పార్టీకి మద్దతునీయడమే ఒక బుద్ది తక్కువ పని. ఆనాడు, భారత్-అమెరికా అణు ఒప్పంద బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు మేము ఇప్పుడు చాలా బాధపడుతున్నాము. తనకి మద్దతు ఇస్తున్న మా మీదనే కాంగ్రెస్ పార్టీ సీబీఐను ప్రయోగించి చాలా ఇబ్బందులు పెడుతూ, మమ్మల్ని లొంగదీసుకొని మా మీదనే సవారీ చేయాలని చూస్తోంది.

 

కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీ కుటుంబానికి తప్పవేరెవరికీ చోటు లేదు. అయినప్పటికీ, రాహుల్ గాంధీకి కానీ, ప్రియాంకా గాంధీకి గానీ ప్రజల్లోఎక్కడా ఆదరణ లేదు. వచ్చే సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదు. ఎన్నికల తరువాత మూడవ ఫ్రంట్ అధికారంలోకి రావడం ఖాయం, కాంగ్రెస్ పార్టీ చేతినుడి ప్రభుత్వ పగ్గాలు గుంజుకోవడం కూడా అంతే ఖాయం,” అని అన్నారు.

 

ఆయన ఈ కొత్త పల్లవి అందుకోవడానికి కారణం ఏమిటంటే, కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆయన అక్రమాస్తుల పైన, తన కుమారుడు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ యాదవ్ అక్రమాస్తులపైనా మరియు అతని తమ్ముడి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీతో ఇంతవరకు ఆయన చేసిన సంధి ప్రయత్నాలు విఫలమయి, ఇక నేడో రేపో సీబీఐ దర్యాప్తు మొదలు కావడం తధ్యం అని గ్రహించిన తరువాత, సహజంగానే ఆ అక్కసు ఈ రూపంలో బయటపడింది. ఈ ప్రకటన, ఈ ఆరోపణలు దాని ఫలితమే.

 

తన అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ విచారణకు కేంద్రం చక్రం అడ్డువేసి ఉంటే, అప్పుడు ఆయన ఎటువంటి ఆరోపణలు చేసి ఉండేవారు కాదు. సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళిపోయిన ఆయన కేసుల వ్యవహారంలో కలుగజేసుకోవడం కష్టమే కాక ఆ ప్రయత్నం కొత్త సమస్యలను కూడా తెచ్చిపెతటే అవకాశం ఉందని తెలుసు గనుకనే కాంగ్రెస్ ఈ వ్యవహారంలో వ్రేలు పెట్టలేదు. తద్వారా, ఎన్నికల సమయానికి ములాయం సింగ్ మరింత ఇరకాటంలో పడినట్లయితే, ఎన్నికలలో లాభపడవచ్చునని మరో ఆలోచన కూడా చేసిన కాంగ్రెస్ పార్టీ సీబీఐను ముందుకు సాగనిచ్చింది.

 

అదే జరిగితే, తానూ కాంగ్రెస్ వ్యతిరేఖ రాజకీయ పార్టీలను పోగేసి మూడో ఫ్రంటు కడతానని ములాయం కూడా హెచ్చరిక జారీ చేసాడు. అయితే, అటువంటి తాటాకు చప్పుళ్ళకి కాంగ్రెస్ భయపడితే ఇంతకాలం అధికారంలో ఉండ గలిగేదే కాదు.

 

కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ కుటుంబానికి తప్ప వేరే ఎవరికీ చోటు లేదని విమర్శించిన ఆయన, తన ముఖ్యమంత్రి పీఠాన్నితన కొడుకు అఖిలేష్ యాదవ్ కు అప్పగించినప్పుడు మాత్రం ఆ సూత్రం తనకి వర్తించదని భావిన్చడం విడ్డూరం. అధికారంలో ఉనంతకాలం అవినీతికి పాల్పడి, అక్రమాస్తులు పోగేసుకొని తన జోలికి ఎవరూ రాకూడదనుకొనే ములాయం వంటి నేతలకి మనదేశంలో కొదవలేదు. ఆస్తులు, అధికారమే పరమావధిగా సాగుతున్న రాజకీయాలలో ఇటువంటి ములాయములు అందితే జుట్టు లేకపోతె కాళ్ళు పట్టుకొంటూ, పైకి మాత్రం ప్రజాసేవ గురించి గంభీర ఉపన్యాసాలు ఇస్తుంటారు. అటువంటి వారిని, తన ప్రభుత్వం నడవడం కోసం ఇంత కాలం వెనకేసుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా నిందించక తప్పదు.