రాజకీయ పార్టీగా ఎమ్మార్పీఎస్?
posted on Mar 6, 2012 @ 1:31PM
కేసీఆర్ బాటలో మంద కృష్ణమాదిగ
హైదరాబాద్: తొండలు ముదిరి ఊసరవెల్లులు అవుతాయి. ఇది సహజ పరిణామం. దీనిని రాజకీయాలకు వర్తింపజేస్తే ఉద్యమ సంస్థలు కాలక్రమంలో రాజకీయ పార్టీలుగా రూపాంతరం చెందడం. ఇప్పటికే తెలంగాణా ఉద్యమంకోసం ప్రారంభమైన సంఘాలు రాజకీయ పార్టీలుగా అవతరించాయి. లోక్ సత్తా ప్రజాఉద్యమం లోక్ సత్తా పార్టీగా ఆవిర్భవించింది. తాజాగా ఇప్పుడు ఎస్సీల హక్కులకోసం పోరాడుతున్న ఎమ్మార్పీఎస్ రాజకీయ పార్టీగా అవతారం ఎత్తబోతుంది. తమసంస్థ రాజకీయ పార్టీగా మారకపోతే ఎస్సీ వర్గీకరణ సాధించడం కష్టమని ఆ సంఘం నాయకుడు యోచిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఎమ్మార్పీఎస్ ను వచ్చే ఎన్నికల్లోగా రాజకీయపార్టీగా నమోదుచేయాలని ఆ పార్టీ అధినేత మంద కృష్ణమాదిగ యోచిస్తున్నట్లు తెలిసింది. ఎస్సీలకు రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో 25మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉండగా, నలుగురు మాదిగ ఎంపీలున్నారు. వివిధ పార్టీల్లో ఉన్న వీరు మాదిగ హక్కుల గురించి పోరాడటం లేదన్న భావన సర్వత్రా ఉంది. అందుకే నేరుగా రాజకీయాల్లోకి దిగి లక్ష్యాన్ని సాధించుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు యోచిస్తున్నట్లు తెలిసింది.