మెదక్ లోక్ సభ పై కన్నేసిన ప్రభుత్వ విప్ జయప్రకాష్ రెడ్డి
posted on Mar 6, 2012 @ 1:56PM
మెదక్: సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాష్ రెడ్డి మెదక్ లోక్ సభ స్థానంపై కన్నేశారు. 2014లో జరగబోయే ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మెదక్ లోక్ సభ స్థానంనుంచి పోటీచేస్తానని ప్రకటించారు. అధిష్టానంనుంచి ఎటువంటి భరోసాలేనప్పటికీ జయప్రకాశ్ రెడ్డి ఇటువంటి ప్రకటన చేయడం జిల్లాలో సంచలనం కలిగించింది. అంతేకాకుండా ఆయన మరో ప్రకటనచేస్తూ మెదక్ పార్లమెంట్ సభ్యురాలు విజయశాంతికి వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ టిక్కెట్టు ఇవ్వడం లేదని కూడా జోస్యం చెప్పారు. ఈ ప్రకటన టిఆర్ఎస్ శ్రేణులను గందరగోళంలో పడేసింది. ఎప్పుడో జరగబోయే ఎన్నికల గురించి ఇప్పుడు తన గురించే కాకుండా ఇతర పార్టీల అభ్యర్ధులపై కూడా జయప్రకాష్ రెడ్డి మాట్లాడటంలో అతని అంతర్యమేమిటని వారు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే గత ఎన్నికల్లో విజయశాంతిపై పోటీచేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి చాగండ్ల నరేంద్ర నాధ్ ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిజానికి ఆయన మళ్ళీ మెదక్ నుంచి పోటీ చేయాలనుకుంటున్న తరుణంలో తూర్పు జయప్రకాష్ రెడ్డి తనకు పోటీగా వస్తానంటూ ప్రకటించడం నరేంద్ర నాధ్ ను కలవరపరుస్తోంది. విమర్శలతో సంచలనాలు సృష్టించే ఎమ్మెల్యేగా పేరుబడ్డ జయప్రకాష్ రెడ్డి తాజా ప్రకటన జిల్లాలో ఎలాంటి రాజకీయ పరిస్థితులను సృస్టించనుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది.