మేకపాటిది మేకపోతు గాంభీర్యమేనా?
posted on Mar 6, 2012 @ 12:28PM
హైదరాబాద్: వైయస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి జగన్ కు కీలక మద్దతుదారుడుగా నిలిచారు. ఆయన రాజీనామాను లోక్ సభ స్పీకర్ ఆమోదించడంతో నెల్లూరు లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలువనున్న మేకపాటి తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు లభించిన అన్ని మెజారిటీలను అధిగమిస్తాననే గట్టి నమ్మకంతో వున్నారు. అయితే మేకపాటిది మేకపోతు గాంభీర్యమేనని వచ్చే ఎన్నికల్లో ఆయన అసలు గెలువగలిగితే గొప్పేనని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. నెల్లూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ కు గట్టి నాయకుల బలం ఉంది. కెడర్ కొంత జగన్ పార్టీవైపు వెళ్ళినప్పటికీ వచ్చే కొద్ది నెలల్లో వీరంతా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడం ఖాయమని, ఇదే జరిగితే మేలపాటి పరాజయం తప్పదని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు.
మేకపాటి 1983లో మొదటిసారిగా జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బిజెపి నేత వెంకయ్యనాయుడుతో పోటీపడి పరాజయం పాలయ్యారు. 1985లో వచ్చిన శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో మేకపాటి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి టిడిపి అభ్యర్ధి ఖమ్మం విజయరామిరెడ్డిపై గెలుపొందారు.1989 ఎన్నికల్లో ఒంగోలు ఎంపిగా పోటీచేసి 97వేల మెజారిటీతో విజయం సాధించారు. తరువాత నేదురుమల్లి జనార్ధనరెడ్డితో రాజకీయ వైరం తెచ్చుకుని కాంగ్రెస్ కు దూరమై తెలుగుదేశం పార్టీలో చేరారు. 1996 లోక్ సభ ఎన్నికల్లో ఒంగోలు నుంచి టిడిపి తరపున పోటీచేసి మాగుంట పార్వతమ్మ చేతిలోనూ, తరువాత 1998 మధ్యంతర ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి చేతిలోనూ ఓడిపోయారు. దీంతో ఆయన మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. 2004 ఎన్నికల్లో రాజమోహనరెడ్డి నర్సరావుపేట ఎంపిగా పోటీచేసి 85వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009 ఎన్నికలనాటికి నియోజకవర్గాల పునర్విభజనతో సొంత ప్రాంతమైన నెల్లూరు నుంచి పోటీచేసి గెలుపొందారు. గెలుపు ఓటములు సమానంగా ఉన్న మేకపాటికి వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు కూడా ఫిఫ్టీ-ఫిఫ్టీగానే ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.