గోదావరి తీరంలో రాజకీయ సునామీ!
posted on Jan 12, 2024 6:57AM
కాపు రిజర్వేషన్ల సాధన సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ప్రత్యక్ష రాజకీయాలలో యాక్టివ్ కానున్నట్లు కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వారాహి యాత్ర మొదలు పెట్టారో అప్పటి నుండి ఏపీ రాజకీయాలలో మళ్ళీ ముద్రగడ పేరు వినిపించడం మొదలైంది. పవన్ యాత్రల సమయంలో ముద్రగడ బహిరంగ లేఖలు, వ్యాఖ్యలు రాజకీయాలలో హీట్ పెంచాయి. కానీ, ఈ మధ్య కాలంలో మళ్ళీ ముద్రగడ ఎక్కడా కనిపించలేదు.
అయితే, ముద్రగడ వైసీపీలో చేరనున్నట్లు గట్టి ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లే వైసీపీ నేతలు ఎంపీ మిధున్ రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, స్థానిక ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు వంటి నేతలు ముద్రగడను కలిశారు. ఆ తర్వాత స్వయంగా ముద్రగడ గాజువాక వెళ్లి మంత్రి గుడివాడ అమరనాధ్ తో భేటీ కూడా అయ్యారు. అప్పుడే ముద్రగడ వైసీపీలోకి వెళ్లడం ఖాయమని నిర్ధారణయిందని వైసీపీ నేతలు గట్టిగా చెప్పారు. జనవరి 2న ముద్రగడ పద్మనాభం అధికారికంగా వైసీపీలో చేరనున్నట్లు ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు. ముహూర్తం గడువు ముగిసింది కానీ ముద్రగడ మాత్రం వైసీపీ కండువా కప్పుకోలేదు. దీంతో ముద్రగడ రాజకీయ వ్యూహం ఏంటన్న ఆసక్తి మొదలైంది. అయితే, నిన్నటి వరకూ వైసీపీలో చేరేందుకు ప్రణాళికలు రచించుకున్న ముద్రగడ చూపు ఇప్పుడు జనసేన వైపు మళ్లినట్లు కనిపిస్తోంది.
సరిగ్గా కొత్త ఏడాదిలో వైసీపీలో చేరేందుకు పెట్టుకున్న ముహూర్తం రోజునే ఆయన తన అనుచర వర్గంతో కలసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం తర్వాత ఆయన తన నిర్ణయంపై పునరాలోచన చేసినట్లు తెలుస్తుంది. ముద్రగడ వైసీపీలో చేరేందుకు వెనకడుగు వేయడం వెనక బలమైన కారణం కూడా ఉందని అంటున్నారు. ముద్రగడ వైసీపీలో చేరితే ఆయన కుమారుడు చల్లారావుకు వైసీపీ నుండి టికెట్ హామీ దక్కింది. ముద్రగడ చల్లారావును కాకినాడ ఎంపీ లేదా పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయించవచ్చని ప్రచారం సాగింది. ముద్రగడ కోడలుకు తుని అసెంబ్లీ సీటు ఇస్తారన్న మరో ప్రచారం కూడా తెరపైకి వచ్చింది.
కానీ, ఇప్పుడు ఆయా స్థానాలలో సీట్ల సర్దుబాటు లొల్లి కొనసాగుతున్నది. కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతను ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తున్నారు. వైసీపీ రిలీజ్ చేసిన రెండవ జాబితాలో పిఠాపురం అసెంబ్లీ సీటుకు కాకినాడ ఎంపీ వంగా గీత పేరు ప్రకటించారు. ఇక మిగిలింది కాకినాడ ఎంపీ సీటు, తుని సీటు అని అనుకున్నారు. అయితే తుని నుంచి మంత్రి దాడిశెట్టి రాజా ఉండగా.. ఆయనను ఎంపీగా కాకినాడ నుంచి పోటీ చేయమని వైసీపీ అధినాయకత్వం సూచించినా ఆయన నో చెప్పినట్లు తెలుస్తున్నది. దాంతో దాడిశెట్టి రాజా తుని నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉంటారని వైసీపీ నేతలే చెబుతున్నారు. అదే విధంగా కాకినాడ ఎంపీ సీటు విషయంలో కూడా వైసీపీ అధినాయకత్వం నుంచి చలమలశెట్టి సునీల్ కి హామీ దక్కినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ముద్రగడకి హామీ ఇచ్చిన సీట్లకు కూడా వైసీపీ అభ్యర్ధులను ఖరారు చేసేసింది. దాంతో ఇపుడు ముద్రగడ వైసీపీ నుండి జనసేన వైపు చూపి మళ్లించారని అంటున్నారు. ముద్రగడ ఆసక్తి ఆధారంగా ఇటీవల జనసేనకు చెందిన నాయకులు కూడా ముద్రగడ నివాసానికి వెళ్ళి చర్చలు జరిపారు.
గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు బొలిశెట్టి శ్రీనివాస్, తాతాజీ, కాపు జేఏసీ నేతలు ముద్రగడతో సమావేశమై చర్చలు జరిపారని తెలుస్తుంది. దీంతో ముద్రగడ జనసేనలో చేరే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. కాగా తాము ముద్రగడను మర్యాదపూర్వకంగానే కలిశామని నేతలు తెలిపారు. అదలా ఉండగానే మరో రెండు మూడు రోజుల్లో జనసేన ముఖ్యనేతలు కొందరు ముద్రగడను కాలవనున్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు. కాగా, జనసేన నేతలు తనను కలవడంపై ముద్రగడ మాత్రం ఇప్పటికీ మౌనంగానే ఉన్నారు. ఇప్పటికే కాపు పెద్దలు తనను దూషించినా దీవెనల్లానే స్వీకరిస్తానని, వైసీపీ కుట్రలో కాపు పెద్దలు పావులుగా మారొద్దని, కాపునేతలకు జనసేన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పవన్ కల్యాణ్ జనవరి 4న రాసిన ఓ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఇది ముద్రగడను ఉద్దేశించే, ముద్రగడ ఆలోచన ఆధారంగానే రాసిన లేఖగా ఇప్పుడు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరిస్థితులు చూస్తే ముద్రగడ ఆలోచన జనసేన వైపు ఉన్నట్లేనేని అంటున్నారు.