కమలానికి విక్రమ్ గౌడ్ దూరం.. బీజేపీకి రాజీనామా చేసిన బీసీ నేత
posted on Jan 11, 2024 @ 3:01PM
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన పరాజయ పరాభవ భారాన్ని పక్కన పెట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ నుంచి అత్యధిక పార్లమెంటు స్థానాలలో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలించి బలమైన బీసీ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కమలం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పార్టీ కోసం పని చేస్తున్న తన వంటి నేతలకు బీజేపీలో గుర్తింపు లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిచేరిన తనవంటి వారిని పార్టీలో అంటరాని వారిగా చూస్తున్నారని పేర్కొంటూ ఆయన బీజేపీకి రాజీనామా చేశారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపిచారు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీలో ఆ క్రమశిక్షణ మచ్చుకైనా కనిపించడం లేదనీ ఆ లేఖలో పేర్కొన్నారు. అంతే కాకుండా పార్టీలో కీలక నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కినా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉన్న నేతలు చోద్యం చూస్తున్నారని, బీజేపీలో కొనసాగాలంటే గ్రూపు రాజకీయాలలో ఉండాల్సిందే అన్న పరిస్థితి ఉందనీ విక్రమ్ గౌడ్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి బాధ్యత ఎన్నికల తర్వాత ఓటమికి ఎవరూ బాధ్యత తీసుకోలేదని విక్రమ్ గౌడ్ ఆరోపించారు. లోక్ సభకు పోటీ చేసే అవకాశంపై పార్టీ హైకమాండ్ నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో పార్టీని వీడుతున్నట్లు విక్రమ్ గౌడ్ కిషన్ రెడ్డికి పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ఇలా ఉండగా హైదరాబాద్ మహానగరంలో బలమైన గౌడ సామాజికవర్గానికి చెందిన నాయకుడు ముఖేష్ గౌడ్ కుమారుడైన విక్రమ్ గౌడ్ రాజీనామా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ వీడొద్దంటూ బీజేపీ నేతలు బుజ్జగించినప్పటికీ, లోక్ సభ కు పోటీ విషయంలో స్పష్టమైన హామీ రానందున విక్రమ్ గౌడ్ రాజీనామాకే మొగ్గు చూపారని అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో విక్రమ్ గౌడ్ తన భివిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.