Read more!

మళ్ళీ ఫిరాయింపుల సీజను మొదలయిందా?

 

నదులన్నీ వెళ్లి సముద్రంలో కలిసినట్లు, గతంలో చిన్నాచితకా రాజకీయ పార్టీలన్నీ వెళ్లి కాంగ్రెస్ మహాసముద్రంలో కలిసేవి. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీల నేతలందరూ వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకలుస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుండి ఆ వలసలు ఎక్కువగా కనిపించాయి. గత కొద్ది రోజులుగా ఆ వలసల జోరు కొంత తగ్గింది. కానీ, మళ్ళీ నేడు ఆ పార్టీకి చెందిన పరకాల మాజీ శాసన సభ్యుడు బొజ్జపల్లి రాజయ్య పార్టీకి రాజీనామాచేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జేరుతున్నట్లు ప్రకటించడంతో మళ్ళీ వలసల సీజను మొదలయినట్లుంది.

 

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పక్కలో బల్లెంలా ఉన్న మరో 9మంది జగన్ వర్గానికి చెందిన శాసన సభ్యులు కూడా, తమపై అనర్హతవేటు పడదని రూడీ అయితే, చంచల్ గూడా జైలు బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, చంచల్ గూడా జైలు తలుపులు మూసి ఉన్నపటికీ, పార్టీ తలుపులు బార్లా తెరిచి అందరికీ స్వాగతం పలుకుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు పార్టీలో చేర్చుకొంటున్న వారందరికీ రేపు ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ కేటాయించడం సాధ్యమేనా? అప్పుడు పార్టీలో చెలరేగే అసమ్మతి గురించి ఏమయినా ఆలోచన చేస్తోందా?

 

ఇప్పుడు పార్టీలో చేరుతున్న వారు మళ్ళీ తిరుగు ప్రయాణమయితే, అప్పుడు పార్టీ పరిస్థితి ఏమిటి? ఒకనాడు ప్రజారాజ్యం పార్టీ కూడా ఇటువంటి పరిస్థితులవల్లనే కుప్పకూలిన సంగతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి గుర్తులేదా?అనే సందేహాలున్నాయి.

 

ప్రస్తుతం పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉన్నందున, పార్టీలోకి వస్తున్నరాజకీయనేతల ప్రవాహమే పార్టీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ పార్టీకి శ్రీరామ రక్షగా ఉంటుందని బహుశః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తునందునే అందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లుంది. జగన్ మోహన్ రెడ్డి జైల్లోంచి బయటకి వస్తే పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే ఎలాగు చక్కబెడతారు గనుక, ఇప్పుడు వచ్చే వారిని ఆపడం ఎందుకని అందరికీ ఆపార్టీ స్వాగతం పలుకుతునట్లు ఉంది.