పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు.. బండి సంజయ్ యాత్రకు అనుమతి నిరాకరణ
posted on Aug 24, 2022 7:20AM
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు జనగామ పోలీసలు బ్రేక్ వేశారు. జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని పేర్కొన్న పోలీసులు ఈ మేరకు బండి సంజయ్ కు నోటీసులు ఇచ్చారు. పాదయాత్ర పేరిట విద్వేష పూరిత వ్యాఖ్య చేస్తున్నారనీ, దీని వల్ల శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమౌతుందంటూ నోటీసులో పేర్కొన్నారు.ఈ మేరకు వర్ధన్నపేట ఏపీసీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి నోటీసు జారీ చేశారు. అలాగే పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ లకు నోటీసులను అందించారు.
ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి సమీకరణ చేస్తున్నారనీ, రెచ్చగొట్టే ప్రకటనలతో జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంటూ, తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని నోటీసులో పేర్కొన్నారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా పోలీసుల నోటీసుపై బీజేపీ మండిపడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రశ్నే లేదని స్పష్టం చేసింది. పోలీసుల అనుమతితోనే మూడు విడతలుగా పాదయాత్ర కొనసాగిస్తున్నమని పేర్కొంది. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని ప్రశ్నించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వరకూ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
అలాగే ఈ నెల 27న హన్మకొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అలాగే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోకుండా ప్రభుత్వానికి తగు సూచనలు ఇవ్వాల్సిందిగా బీజేపీ నేతలు గవర్నర్ తమిళిసైను కలిసి కోరారు. కాగా తన పాదయాత్రను అడ్డుకోవడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎక్కడ యాత్రను ఆపారో అక్కడే మళ్లీ ప్రారంభిస్తానని ప్రకటించారు. జనగామలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కరీంనగర్‌లోని ఇంటి దగ్గర వదిలి పెట్టి గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి విదితమే, కాగా, ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించి బీజేపీ అత్యవసరంగా హౌజ్ మోషన్ పిటిసన్ దాఖలు చేసింది. అయితే హైకోర్టు ఈ పిటిషన్‌ని తిరస్కరించి, లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.