జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు కమిషనరేట్ల
posted on Dec 30, 2025 8:52AM
హైదరాబాద్ మహానగరంలో పోలీస్ పరిపాలనను మరింత పటిష్టంగా, సమర్ధవంతంగా మార్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న మూడు కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ నాలుగు కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. అంటే ప్రస్తుతం ఉన్న మూడు కమిషనరేట్లకు అదనంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసింది. ఇక నుంచి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి, ప్యూచర్ షిటీగా నాలుగు కమిషనరేట్లు ఉంలాయి. ఈ మేరకు సోమవారం (డిసెంబర్ 29) రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అదే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రత్యేక పోలీస్ యూనిట్‌ను ఏర్పాటు చేసి ఎస్పీని నియమించింది.
తాజా ఉత్తర్వుల మేరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, నగర వాణిజ్య కేంద్రంగా ఉన్న బేగంపేట, అంతర్జాతీయ రవాణాకు ముఖ్యమైన శంషాబాద్ ఎయిర్‌పోర్టు, న్యాయ వ్యవస్థకు కేంద్రంగా ఉన్న బుద్వేల్ హైకోర్టు వంటి అత్యంత కీలక ప్రాంతాలు వచ్చాయి. దీంతో ఈ ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, చట్ట పరిరక్షణ మరింత పటిష్టంగా మారనుంది.
ఇక సైబరాబాద్ కమిషనరేట్‌కు ఐటీ, పారిశ్రామిక హబ్‌లు, ఐటీ కారిడార్ ప్రాంతాలైన బౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, మాదాపూర్, రాయదుర్గలు వచ్చాయి. అలాగే పరిశ్రమల కేంద్రాలైన పఠాన్ చెరు, జీనోమ్ వ్యాలీ, ఆర్సీ పురం, అమీన్‌పూర్ వంటి ప్రాంతా లను కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కి తీసుకువచ్చారు. ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇక రాచకొండ కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరించి దాని పేరును మల్కాజ్ గిరి కమిషనరేట్ గా మార్చారు. తొలుత మహంకాళి లేదా లష్కర్ కమిషనరేట్ అన్న పేరును తీవ్రంగా పరిశీలించిన ప్రభుత్వం చివరకు మల్కాజ్ గిరి కమిషనరేట్ గా నిర్ణయించింది. ఈ కమిషనరేట్ పరిధిలో కీసర, శామీర్‌పేట, కుత్భుల్లాపూర్, కొంపల్లితో పాటు ఉత్తర హైదరాబాద్‌కు చెందిన పలు ప్రాంతాలు చేరనున్నాయి. వేగంగా పెరుగుతున్న నివాస ప్రాంతాలకు అనుగుణంగా పోలీస్ సేవలను మరింత దగ్గరగా తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇలా ఉంటే భవిష్యత్ లో అభివృద్ధి కేంద్రంగా మారనున్న ప్రాంతాల కోసం ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ కమిషనరేట్ పరిధిలోకి చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు వచ్చాయి. భవిష్యత్‌లో పెద్ద ఎత్తున పారిశ్రామిక, వాణిజ్య, నివాస అభివృద్ధి జరగనున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా ప్రణాళికగా ఈ కమిషనరేట్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఇక పోతే యాదాద్రి భువనగిరి జిల్లాను ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా ఏర్పాటు చేసి, అక్కడ ప్రత్యేకంగా ఎస్పీ ని నియమించింది. ఆలయ ప్రాంతం కావడం, ప్రజా రద్దీ అధికంగా ఉండటంతో ప్రత్యేక భద్రతా వ్యవస్థ అవసరమన్న భావనతో ఈ నిర్ణయం తీసుకుంది.