బరితెగిస్తున్న పోలీసులు
posted on Mar 5, 2012 @ 12:59PM
నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రాంతంలో పోలీసులు బరితెగించి ఎర్రచందనం, మద్యం, ఇసుక మాఫియాతో చేతులుకలుపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే మాఫియా ముఠాలు ధైర్యంగా పట్టపగలే తమ అక్రమ వ్యాపారాలను చేసుకుంటూ పోతున్నారు. పోలీసులకు నెలవారీ మామూళ్ళు చెల్లిస్తున్నామని వారు బహిరంగంగానే చెబుతున్నా పోలీసు అధికారులెవరో వారిని నిరోధించడానికి కానీ, వారి ప్రకటనలను ఖండించడానికి గాని చొరవ చూపడంలేదు. అయితే ఎమ్మెల్యే మాత్రం పోలీసులకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. ఎర్రచందనం, మద్యం, ఇసుక మాఫియాలు స్థానిక పోలీసుల సహాయంతోనే రెచ్చిపోతున్నారని బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఆయన మరో ముందడుగు వేసి పట్టపగలే లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా డక్కిలి ప్రాంతంలో తన అనుచరులతో కలిసి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 2014 వరకు తనను ఇక్కడినుంచి ఎవరూ బదిలీ చేయలేరని, నాకు డబ్బిచ్చి మీ పని మీరు చేసుకోమంటూ ఒక పోలీస్ అధికారి మాఫియా ముఠాలకు భరోసా ఇచ్చారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎమ్మెల్యే ఆరోపణలను కూడా పోలీస్ శాఖ ఖండించకపోవడం విశేషం.