ప్రశ్నార్ధకంగా మారిన పామాయిల్ సాగు
posted on Mar 5, 2012 @ 1:21PM
హైదరాబాద్: రాష్ట్రంలో పామాయిల్ సాగు ప్రశ్నార్ధకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షన్నర ఎకరాల్లో పామాయిల్ తోటలు వేసిన రైతులు గిట్టుబాటు ధరలేక పంట ఖర్చులు పెరిగి నష్టాలతో విల విలలాడుతున్నారు. పామాయిల్ సాగు చేస్తున్న రైతులకు తన్నుకు సుమారు వెయ్యి రూపాయలు నష్టం వస్తుండగా అదే తనను పామాయిల్ ను ఆయిల్ గా మారుస్తున్న సంస్థలకు మూడున్నర వేల వరకు లాభం వస్తుంది. టన్ను పామాయిల్ గెలల ద్వారా ఆయా సంస్థలకు సుమారు రూ.11,500 ఆదాయం వస్తుంది. టన్ను గెల్లను ఆయిల్ గా మార్చడానికి రెండు వేలు ఖర్చవుతోంది. రైతుకు రూ.6వేలు చెల్లిస్తున్నారు. సంస్థలకు మొత్తం ఖర్చు రూ.8 నుంచి 8,500 వరకు అవుతుండగా లాభం మాత్రం మూడు వేల పైనే వస్తోంది. మరోవైపు రైతుకు గిట్టుబాటు కాక నష్టపోతున్నాడు. గత ఐదేళ్ళలో పామాయిల్ సాగు వ్యయం బాగా పెరిగింది. 2008లో కూలీరేట్లు రూ.100 ఉండగా, అది రూ.200కు, డిఎపి బస్తా రూ.550 నుంచి రూ.1050కి, పోటాష్ రూ.270 నుంచి 620కి పెరిగింది. ఈ పెరిగిన ధరల నేపధ్యంలో టన్ను పామాయిల్ గెలలకు కనీసం రూ.9000 చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు వంటనూనెల డిమాండ్ తీర్చడానికి ప్రభుత్వం విదేశాల నుంచి పామాయిల్ ను దిగుమతి చేసుకునేది. విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఆదా చేయడానికి, దేశంలో వంటనూనె ఉత్పత్తులను పెంచడానికి నిర్ణయించిన ప్రభుత్వం పామాయిల్ తోటలను పెంచవలసిందిగా రైతులను ప్రోత్సహించింది. ప్రభుత్వం మాటలను నమ్మిన రైతులు వేలాది హెక్టార్లలో ఈ పంటను పండిస్తున్నారు. తీరా రైతుల సంక్షేమం విషయానికొచ్చే సరికి వారిని ఆడుకోవడానికి ప్రభుత్వం మొహం చాటేస్తోంది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.