రాజీవ్ భీమా ప్రాజెక్టుకు నిధుల కొరత
posted on Mar 5, 2012 @ 11:45AM
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఉద్దేశంతో ప్రారంభించిన రాజీవ్ బీమాప్రాజెక్టు పనులు నిధులకొరతతో మూలపడ్డాయి. ఈ పనులకు 2005లో శంఖుస్థాపన చేశారు. పనులు ప్రారంభమై 7 ఏళ్లు గడిచినా ఇంత వరకు ఏ ఒక్క పనీ పూర్తికాలేదు. రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందలేదు. కొన్ని పనులు అసలే ప్రారంభం కాలేదు. ఏనుగుంట, రంగ సముద్రం ప్రాజెక్టు పనుల పూర్తయినా సాంకేతిక యంత్ర వైఫల్యాల కారణంతో నీటి విడుదల జరగడం లేదు. సుమారు 57వేల ఎకరాలకు నీరు అందించాల్సిన శంకర సముద్రం పనులు మూడేళ్ళక్రితం నిలిచిపోయాయి. ముంపునకు గురయ్యే కానాయపల్లి గ్రామాన్ని నేటికీ తగిన పరిహారం చెల్లించి తరలించాకపోవడం, భూసేకరణ కూడా చేయకపోవడంతో ఈ పనులు పెండింగ్ లో పడ్డాయి. దీంతో శంకరసముద్రం కుడి ఎడమ కాల్వల పనులు కూడా నిలిచిపోయాయి. ఎడమ కాలువల ద్వారా కొల్లాపూర్ మండలం వరకు 50వేల ఎకరాలు, కుడికాలువ ద్వారా పెద్దమందడి, అడ్డాకుల మండల పరిధిలో 8వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తికావడానికి సుమారు రూ.250 కోట్లు అవసరం కాగా ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లో రూ.175 కోట్లు మాత్రమే కేటాయించింది. ప్రతి సంవత్సరం ఇలా అరకొర నిధులు మంజూరు చేస్తుండడంతో ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగుతున్నాయి.