పోలీసులు సబితతో కుమ్మక్కయ్యారు : శంకరరావు
posted on Dec 20, 2011 @ 1:57PM
హైదరాబాద్: శంకర రావుపై ఉదయం ఎన్టీఆర్ నగర్ వద్ద దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ నాపై దాడి జరిగినా పోలీసులు స్పందించలేదని, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డితో వారు కుమ్మక్కయ్యారని చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర రావు విమర్శించారు. పోలీసులు ప్రజల కోసం పని చేయాలన్నారు.పేదల సమస్యలు తెలుసుకునేందుకే తాను అక్కడకు వెళ్లానని, చేతికి, తలకు గాయమైందన్నారు. ఎవరు తనను బెదిరించినా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్నారు. మంత్రి వర్గం నుండి తనను తొలగించినా భయపడేది లేదన్నారు.
తాను సాధారణ వ్యక్తిగా పోరాటం చేస్తున్నానన్నారు. భూకబ్జాలపై, తనపై జరిగిన దాడిపై అధిష్టానానికి లేఖ రాస్తానన్నారు. హోంమంత్రి, ఆమె తనయుడు రౌడీలతో కలిసి తనపై దాడి చేయించారని ఆరోపించారు. భూకబ్జాలపై విచారణ జరిపాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయంపై చర్యలు తీసుకోకుంటే సిబిఐ విచారణ కోరతానని హెచ్చరించారు. సబితను ఆ పదవి నుంచి తప్పించాలన్నారు. కాగా దాడి తర్వాత మంత్రికి బిపి పెరగడంతో నిమ్స్ హాస్పిటల్ తరలించి చికిత్స చేశారు.