వారి అభిప్రాయాలు తీసుకున్నాకే గీతపై నిర్ణయం
posted on Dec 20, 2011 @ 1:54PM
న్యూఢిల్లీ: హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతను నిషేధించాలని కోరటాన్ని భారతదేశంలోని రష్యా రాయబారి కార్యాలయం, రష్యన్ అంబుడ్స్‌మన్ ఖండించింది. ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఎస్సీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద రచించిన భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అనే పుస్తకం విశ్వవ్యాప్తంగా గౌరవనీయమైనదని, అందువల్ల దాన్ని నిషిధించాలనటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యన్ అంబుడ్స్‌మన్ వ్లాదిమర్ లుకిన్ ఓ ప్రకటనలో తెలిపారు. గీత వివాదాస్పదం కావడం విచారకరమని రష్యన్ ప్రభుత్వం సోమవారం రాత్రి పేర్కొంది. పవిత్ర గ్రంథాన్ని కోర్టుకు లాగడం సరికాదని, ఇలాంటి సంఘటనలు సైబీరియాలోని అందమైన నగరం టోమ్‌స్క్‌లో జరగడం విస్మయకరమని, లౌకికవాదానికి, పరమత సహనానికి ప్రసిద్ధి గాంచిన ఈ నగరంలో ఇలాంటివి చోటు చేసుకోవడం విచారకరమని, దీన్ని బట్టి ఇలాంటి అందమైన నగరంలో కూడా పిచ్చివాళ్లు ఉంటారని స్పష్టమవుతోందని, ఇది ఎంతో బాధాకరమని భారత్‌లో రష్యా రాయబారి అలెగ్జాండర్ ఎం కదాకిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా భగవద్గీత నిషేధంపై పెనుదుమారం చెలరేగడంతో రష్యన్ కోర్టు తన తీర్పును ఈ నెల 28వ తేదికి వాయిదా వేసింది. ఈ విషయంలో రష్యన్ అంబుడ్స్‌మెన్, మాస్కోకు చెందిన నిపుణులు, సెయింట్ పీటర్స్‌బర్గ్ నుంచి అభిప్రాయాలు తీసుకొని అప్పుడు నిర్ణయం తీసుకోవాలని ఇస్కాన్ రష్యా విభాగం కోరడంతో కేసును వాయిదా వేసింది. నిషేధంపై తీవ్ర ప్రకంపనలు చెలరేగుతున్న దృష్ట్యా ఈ కేసును పిటిషన్‌దారు ఎప్పుడైనా ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కాగా, భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని ప్రతిపక్షనేత సుష్మస్వరాజ్ లోక్‌సభలో డిమాండ్ చేశారు. భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటిస్తే భవిష్యత్‌లో ఏ దేశంకూడా హిందువుల మనోభావాలను భంగం కలిగించే అవకాశం ఉండదని ఆమె అన్నారు. ఇంత గొడవ జరగుతున్నా కేంద్రం పట్టించుకోకపోవటం శోచనీయమన్నారు. అంతకు ముందు భారతీయుల మనోభావాలను గౌరవించాలని రష్యన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు విదేశీ వ్యవహారాల శాఖామంత్రి, ఎస్‌ఎం కృష్ణ లోక్‌సభలో ప్రకటన చేశారు. అయితే మంత్రి ప్రకటనతో సంతృప్తి చెందని బీజేపీ ఈమేరకు డిమాండ్ చేసింది.