పోలవరం ఫైల్స్ దహనం కేసు.. ఇదీ అసలు కథ!
posted on Aug 19, 2024 @ 9:33AM
ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమార్కులు బెంబేలెత్తిపోతున్నారు. వైసీపీ హయాంలో పలు శాఖల్లో భారీ ఎత్తున అవినీతి జరిగింది. వైసీపీ నేతలు అధికారుల సహకారంతో అందిన కాడికి ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలు, భూకబ్జాల వ్యవహారంపై దృష్టిసారించింది. ఫలితంగా ఒక్కొక్కరి అవినీతి బండారం వెలుగులోకి వస్తోంది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో కమిటీలు వేస్తూ పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నారు. విచారణ ప్రక్రియ వేగంగా జరుగుతుండటంతో ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారోనన్న ఆందోళన వైసీపీ నేతలు, వారికి సహకరించిన అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు అరెస్టు కాగా.. జోగి రమేశ్ చుట్టూ ఉచ్చు బిగిసింది. అయితే, పలు ప్రాంతాల్లో విచారణ జరుగుతున్న క్రమంలోనే ఫైల్స్ మాయం లేదా దగ్ధం అవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఫైల్స్ దగ్దం వెనుక అసలు కథ ఏమిటో వెలికి తీస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు భూసేకరణ స్పెషల్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దహనం ఘటన చోటు చేసుకుంది.
పోలవరం భూసేకరణ ఫైళ్ల దహనం ఘటనపై విచారణాధికారిగా జాయింట్ కలెక్టర్ ఎస్.చినరాముడును నియమించారు. విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో తొలుత అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో పాటు నిబంధనలు పాటించని సీనియర్ అసిస్టెంట్లు కె.నూకరాజు, కారం బేబీ, స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కె.కళాజ్యోతి, ఆఫీసు సబార్డినేట్ కె.రాజశేఖర్‌ను సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న డిప్యూటీ తహశీల్దార్లు ఎం.కుమారి, ఎ.సత్యదేవికి నోటీసులు జారీ చేశారు. వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అగమ్యగోచరంగా మార్చేశారు. ఆ పార్టీ నాయకులు భూ పరిహారాన్ని అందిన కాడికి దోచుకున్నారు. అక్రమాలకు కొందరు అధికారులు అండగా నిలవడంతో నకిలీ భూ పట్టాలు పెట్టి ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్రమార్కుల్లో గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలో పోలవరం భూ పరిహారం చెల్లింపుల్లో అక్రమాలను మాయం చేయాలని భావించి ఫైళ్ల దహనానికి పాల్పడ్డారు. ఫైళ్ల దహనం వెనుక పలువురు వైసీపీ నేతలు, అధికారుల హస్తం ఉందన్న విమర్శలు ఉన్నాయి.
పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాల్లో పరిహారం చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టు భూ సేకరణలో కొండ పోరంబోకు భూములకు అప్పట్లో నకిలీ డీఫాం పట్టాలు, దొంగ లబ్ధిదారులను సృష్టించి కోట్లలో పరిహారాన్ని పక్కదారి పట్టించారు. ఇందులో పలువురు వైసీపీ నేతలు, రెవెన్యూ, ప్రాజెక్టు భూ సేకరణ అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫైల్స్ ను పరిశీలించకుండా కొందరు అధికారులు వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించి అర్హులకు అందాల్సిన పరిహారాన్ని కాజేశారన్న విమర్శలు ఉన్నాయి. అయితే, ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయానికి సంబంధించిన ఫైళ్లు తగలబెట్టినప్పుడు కీలక అధికారులు సెలవులో ఉండటం, మరి కొందరు అందుబాటులో లేకపోవటం గమనార్హం. దీనినిబట్టి చూస్తే ఉద్దేశపూర్వకంగానే ఫైళ్లను దహనం చేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఫైళ్ల దహనంపై అధికారులు విచారణ జరిపి కాలినవన్నీ సంతకాలు లేని జిరాక్స్ పేపర్లు, అవి పనికిరానివని అధికారులు చెప్పడం వెనక ఏదో మతలబు ఉందన్న చర్చ జోరుగా జరుగుతుంది.
అధికారుల విచారణ తీరుపై మంత్రి కందుల దుర్గేశ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిత్తు కాగితాలేనని మీరు ఎలా తేల్చేస్తారు? ఎవర్నయినా కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు ఫైళ్ల దగ్దం వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో భూ పరిహారం అక్రమాల్లో చక్రంతిప్పిన కొందరు దళారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది. పోలవరం భూసేకరణ ఫైళ్ల దహనం ఘటనపై పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటికీ తమకు పరిహారం అందలేదని, ఇప్పుడు ఫైళ్లు దహనం చేయడంతో మాకు పరిహారం అందించామని అధికారులు చెబితే మేము ఏం చేయాలని ఆందోళన చెందుతున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి వారిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి దగ్దమైన ఫైళ్లు చిత్తు కాగితాలే అని అధికారులు విచారణలో తేల్చినా.. అసలు కథ వేరే ఉందన్న వాదన స్థానికంగా బలంగా వినిపిస్తోంది. నకిలీ డీ ఫాం పట్టాలు, దొంగ లబ్ధిదారులను సృష్టించి వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు పరిహారం సొమ్మును దోచుకున్నారని, ప్రస్తుతం ఆ వివరాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకే ఫైళ్లను దహనం చేశారని, ప్రభుత్వం ఈ విషయంపై మరింత దృష్టి కేంద్రీకరించాలని ముంపు గ్రామాల లబ్ధిదారులు కోరుతున్నారు.