ఏసీఏకు కొత్త టీం.. వైసీపీ హయాంలో అవినీతిపై కొరడా?!
posted on Aug 19, 2024 6:11AM
వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన జేబు సంస్థలా మార్చేసుకున్నారు. అధ్యక్షుడు సహా, మిగిలిన పదవులన్నీ తన బంధుగణం, అనుచరులతో నింపేశారు. ఈ క్రమంలో ఏసీఏలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగింది. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏసీఏను వైసీపీ హయాంలో విజయసాయిరెడ్డి భ్రష్టుపట్టించారు. జగన్ మెప్పుకోసం నిధులను సంస్థకు సంబంధంలేని పనుల కోసం దారి మళ్లించారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఏసీఏపై గురి పెట్టింది. అక్కడ పెద్ద ఎత్తున నిధులను పక్కదారి పట్టించారని గుర్తించింది. ఏసీఏను సక్రమ మార్గంలోకి తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఏసీఏ పగ్గాలు కొత్త పాలక వర్గం చేతుల్లోకి వచ్చాయి. అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్)తో పాటు మొత్తం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో ఏసీఏలోని అన్ని పదవులకు ఒక్కొక్కరే నామినేషన్‌లు దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా పి. వెంకట ప్రశాంత్, కార్యదర్శిగా సాన సతీష్, సంయుక్త కార్యదర్శిగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ట్రెజరర్ గా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ గా డి. గౌరు విష్ణుతేజ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఫలితాలను అధికారికంగా వచ్చే నెల 8న ప్రకటించనున్నారు. అంతకు ముందు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువర్గంమే ఏసీఏ పదవుల్లో కొనసాగింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగు నెలలకు జరిగిన ఎన్నికల్లో అరబిందో డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి ఏసీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా రోహిత్ రెడ్డి, కార్యదర్శిగా గోపీనాథ్ రెడ్డి ఎన్నికయ్యారు. 2022 నవంబర్ జరిగిన ఎన్నికల్లోనూ ఒక్కో పోస్టుకు ఒక్కరే నామినేషన్ వేయడంతో మళ్లీ వారే పదువుల్లో కొనసాగారు. ఏసీఏకు శరత్‌చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి పేరుకే అధ్యక్ష, ఉపాధ్యక్షులు.. వ్యవహారాలన్ని మొత్తం విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే జరిగేవి. విజయవాడ కేంద్రంగా ఏసీఏ పనిచేస్తుండగా..విజయ సాయిరెడ్డి మనుషుల చేతుల్లో వెళ్లిన తరువాత ఏసీఏ ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్టణంకు మార్చేశారు.
2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయంపాలై తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే ఏసీఏ సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఏసీఏ కార్యవర్గం రాజీనామా చేసింది. ఇప్పుడు కొత్తగా ఎన్నికై బాధ్యతలు చేపట్టనున్న నూతన కార్యవర్గం మందు కీలక బాధ్యతలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏసీఏకి చెడ్డపేరు వచ్చింది. ఇష్టారీతిలో నిధుల దుర్వనియోగం జరిగింది. లీగ్‌ల పేరుతో పెద్దెత్తున దోచుకున్నారనే విమర్శలు ఉన్నాయి. బీసీసీఐ ప్రతీయేటా ఏసీఏకి సుమారు రూ. 100 కోట్లు కేటాయిస్తుంది. వాటిని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టారు. దీంతో నిధుల దుర్వినియోగంపై కేసులు పటడంతో.. అవి తేలేవరకు నిధులను ఉద్యోగుల జీతాలు, మ్యాచ్‌ల నిర్వహణకు మాత్రమే ఖర్చు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విశాఖలోని క్రికెట్ స్టేడియంలో టీ20, వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగిన సమయంలో టికెట్లను బ్లాక్‌లో విక్రయించి కమిటీ సభ్యులు కోట్లు దండుకున్నారని విమర్శలు ఉన్నాయి నిధులు దోచుకునేందుకే ఆంధ్రా ప్రీమియర్ లీగ్, ఉమెన్ ప్రీమియర్ లీగ్ ప్రవేశపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి వైసీపీ ఎంపీ విజయాసాయిరెడ్డి కనుసన్నల్లో ఏసీఏలో గత ఐదేళ్లలో నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయన్న విమర్శలు బలంగా ఉంది.
వైసీపీ హయాంలో ఏసీఏలో జరిగిన అవినీతిపై నూతనంగా ఎన్నికైన కమిటీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఎలాంటి చర్యలు తీసుకుంటందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా గడిచిన ఐదేళ్ల కాలంలో ఎన్ని నిధులు వచ్చాయి. ఎన్ని నిధులు ఖర్చు చేశారు. ఎందు కోసం ఖర్చు చేశారు అనే విషయాలపై దృష్టి సారిస్తే శరత్‌చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, గోపీనాథ్ రెడ్డిలు కటకటాల పాలుకావడం ఖాయం అని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో నూతన కమిటీ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ దిశగా చర్యలు తీసుకోవడం ఖాయమని అంటున్నారు.