ఏపీ మూడు రాజధానుల పై ఆరా తీసిన ప్రధాని కార్యాలయం..
posted on Jul 23, 2020 @ 3:31PM
ఏపీ ప్రభత్వం మూడు రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదం కోసం వెళ్లడంతో మూడు రాజధానుల అంశం మళ్ళీ హాట్ టాపిక్ అయింది. ఈ బిల్లు పై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అని అటు ప్రభుత్వం ఇటు ప్రజలు ఉత్కంఠ తో ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాజధాని మార్పు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల వ్యవహారంపై ప్రధాన మంత్రి కార్యాలయం ఆరా తీసినట్లు తెలుస్తోంది. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు సంబంధించి వివరాలు కోరిందట. గవర్నర్‌కు ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి, అమరావతి జేఏసీ నేత జి.వి.ఆర్ శాస్త్రి పీఎంవోకు లేఖ రాశారు. దానిపై స్పందించిన ప్రధాన మంత్రి కార్యాలయం.. గవర్నర్ కార్యాలయాన్ని వివరాలు అడిగినట్లు సమాచారం.
దీని పై జివిఆర్ శాస్త్రి మీడియాతో మాట్లాడుతూ రాజధాని ఏర్పాటు అంశం కేంద్రం పరిధిలోనిదని, హైకోర్టు నోటిఫికేషన్ రాష్ట్రపతి ఆమోదం ద్వారా జరిగిందని, ఇపుడు రాజధాని మార్చడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ తాను ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, హోం మంత్రికి లేఖలు రాసినట్లుగా తెలిపారు. ఇదే సందర్భంలో చట్ట ప్రకారం రాజధాని మార్చడం ఎందుకు సాధ్యం కాదో కూడా పీఎంవో కార్యాలయానికి వివరించినట్లుగా అయన తెలిపారు. అంతే కాకుండా దీనిపై అటార్నీ జనరల్ న్యాయ సలహా కూడా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం తో ఈ విషయం పై స్పందించిన పీఎంవో మరి కొన్ని వివరాలు అడగగా ఆ వివరాలు కూడా సమర్పించినట్లు డాక్టర్ శాస్త్రి తెలిపారు.