బాలికను దత్తత తీసుకుంటాం: చంద్రబాబు
posted on Jul 23, 2020 @ 3:31PM
రాజమండ్రిలో దళిత బాలిక సామూహిక అత్యాచారానికి గురైన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు చలించిపోయారు. ఘటన గురించి తెలుసుకొని తీవ్ర ఆవేదన చెందిన చంద్రబాబు.. వెంటనే బాధితురాలికి టీడీపీ తరపున రూ.2లక్షల ఆర్థిక సాయం అందించాలని పార్టీ నేతలకు ఆదేశించారు. అలాగే పార్టీ తరపున ఆమెను దత్తత తీసుకుని చదివిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
జరిగిన ఘోరాన్ని తెలుసుకునేందుకు చంద్రబాబు నిజనిర్ధారణ కమిటీ వేశారు. కమిటీ సభ్యులు బుధవారం రాజమండ్రి సందర్శించి బాధితురాలిని పరామర్శించారు. విచారణ అనంతరం టీడీపీ నిజనిర్ధారణ కమిటీ చంద్రబాబుకు నివేదిక అందజేసింది. బాధిత బాలిక పదో తరగతి వరకు చదువుకుందని పార్టీ నాయకులు చెప్పారు. దీంతో బాలికను దత్తత తీసుకుని చదివించే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. బాధితురాలిలో ఆత్మవిశ్వాసం కలిగించాలని, టీడీపీ అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని పార్టీ నేతలను చంద్రబాబు కోరారు. ఇటువంటి దుర్మార్గాలపై పోరాడే యోధురాలిలా ఆమెను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.