దేశంలో మరోసారి లాక్ డౌన్? గురువారం సీఎంలతో ప్రధాని మీటింగ్
posted on Apr 6, 2021 @ 10:19AM
దేశంలో మరోసారి లాక్ డౌన్ లోకి వెళ్లనుందా? కరోనా కట్టడికి కేంద్ర సర్కార్ కఠిన చర్యలు తీసుకోనుందా? అంటే మోడీ సర్కార్ కదిలకలను బట్టి పరిస్థితి అలానే ఉంది. దేశంలో ప్రస్తుతం రోజుకు లక్షకు పైగానే కరోనా కేసులు నమోదవుతన్నారు. కరోనా మహమ్మారి తీవ్రత పెరగడంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఏప్రిల్ 8న గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో భేటీ కానున్న ప్రధాని.. కొవిడ్ తాజా పరిస్థితులు, వ్యాక్సినేషన్ సంబంధిత అంశాలపై చర్చించనున్నట్లు పీఎంవో వర్గాలు వెల్లడించాయి. సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం తర్వాత దేశంలో లాక్ డౌన్ పై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ.. ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తుండటం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. గతేడాది కరోనా ఉద్ధృతి సమయంలోనూ పలుమార్లు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని.. ఈ ఏడాది జనవరిలో టీకా పంపిణీ ప్రారంభానికి ముందు కూడా సీఎంలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మార్చి 17న కూడా ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించిన మోడీ... వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. మాడు వారాల్లోనే మరోసారి సీఎంలతో చర్చించబోతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా ఉధృతి దృష్ట్యా గురువారం సమావేశం అత్యంత కీలకంగా మారింది.
దేశంలో కరోనా రెండో ఉద్ధృతి తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ... ఆదివారం అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా నిర్దేశించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్ , కొవిడ్ నిబంధనలను పాటించడం, వ్యాక్సినేషన్.. ఈ పంచముఖ వ్యూహాన్ని అత్యంత నిబద్ధతతో, కట్టుదిట్టంగా అమలుచేస్తేనే మహమ్మారి నియంత్రణ సాధ్యమవుతుందని ప్రధాని మోడీ చెప్పారు.