పాకిస్తాన్లో అశాంతికి మూల్యం చెల్లిస్తున్న భారత్

 

రెండు నెలల క్రితం పాకిస్తానీ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ వద్ద భారత సరిహద్దులలోకి జొరబడి ఇద్దరు భారత జవాన్లను క్రూరంగా చంపడమే కాకుండా, వారిలో హేమంత్ అనే ఒక సైనికుడి తల నరికి తీసుకుపోయినప్పుడు మన జాతీయ రాజకీయపార్టీలన్నీ చాలా హడావుడి చేసాయి. కానీ, ఆ తరువాత ఆ సంగతిని పక్కన పడేసారు. మళ్ళీ మొన్న ఉగ్రవాదులు ఏకంగా మన సైనికుల శిభిరం మీదనే దాడి జరిపి ఐదుగురు సైనికులను పొట్టన బెట్టుకొన్నారు. మళ్ళీ మన రాజకీయ పార్టీలు అంతే హాడావుడి చేసాయి.

 

మన పార్లమెంటు మీద దాడికేసులో అఫ్జల్ గురూను ఉరితీయడాన్ని ఖండిస్తూ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఈ నెల 14న ఏకగ్రీవ తీర్మానం చేసింది. అంతే గాకుండా, అతని శవాన్ని అతని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని మరొక తీర్మానం కూడా చేసింది.

 

మన దేశం మీద దాడిచేసే ఉగ్రవాదులను తన గడ్డపై అనుమతించడమే కాకుండా, వారి దాడిలో అనేక మంది అమాయకులయిన ప్రజలను ప్రాణాలు కోల్పోతుంటే, అటువంటి వారిని పట్టుకొని దండించకపోగా, వారికి ఆశ్రయం కూడా ఇస్తూ, తిరిగి భారత్ ను తప్పు పడుతోంది. గత మూడు దశాబ్దాలలో పాకిస్తాన్ దుశ్చర్యలు నానాటికీ పెరుగుతున్నాయే తప్ప, ఎన్నడూ తగ్గుముఖం పట్టలేదు. భారత్ ఆ దేశంతో ఎంత సంయమనంగా ప్రవర్తిస్తున్నపటికీ, దానిని అలుసుగా తీసుకొని పాకిస్తాన్ పదే పదే ఇటువంటి కవ్వింపు చర్యలకు ప్రయత్నిస్తోంది.

 

భారత్ లో జరిగిన ప్రతీ ఉగ్రవాద దాడికీ మూలాలు పాకిస్తాన్ లో ఉండటం, ఇక్కడ దాడులకు పాల్పడిన వారు నేరుగా ఆ దేశానికి పారిపోయి అక్కడ నిర్భయంగా ప్రజల మధ్య సంచరించడం వంటివి గమనిస్తే, పాకిస్తాన్ కి మన దేశంపట్ల ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో స్పష్టం అవుతుంది.

 

నిన్న జరిగిన పార్లమెంటు సమావేశాలలో ఉభయ సభలు కూడా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఖండిస్తూ, భారత్ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించాయి. అంతే కాకుండా, ప్రస్తుతం పాకిస్తాన్ అధీనంలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీరు కూడా భారతదేశానిదేనని ఏకగ్రీవ తీర్మానం చేసాయి. పాకిస్తాన్ మన కాశ్మీరులో కొంత భాగం ఆక్రమించుకొన్న తరువాత కూడా అవకాశం దొరికినపుడల్లా అంతర్జాతీయ వేదికల మీద కాశ్మీర్ సమస్యను లేవనెత్తే ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ, ఇంతవరకూ దానిని ఖండించడంతోనే సరిపెడుతున్న భారత్, మొట్టమొదటిసారిగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మాదేనని నిర్ద్వందంగా ప్రకటన చేయడం ఆ దేశానికి ఒక హెచ్చరిక వంటిది. అయితే, ఇటువంటి హెచ్చరికలకు భయపడితే అది పాకిస్తాన్ దేశం ఎందుకవుతుంది? మాటకు మాట ఇచ్చేందుకు ఎన్నడూ వెనుకాడని పాకిస్తాన్ త్వరలోనే భారత పార్లమెంటు చేసిన తీర్మానాన్ని ఖండిస్తూ మరో తీర్మానం చేయవచ్చును.

 

వీటివల్ల ఉభయ దేశాలకు ఒరిగేదేమీ లేకపోయినా, అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాలు మరింత చెడుతాయి. పాకిస్తాన్ కు కూడా ఆసంగతి బాగానే తెలిసినప్పటికీ, నాటికి ఆ దేశంలో క్షీణిస్తున్న పరిస్థితుల నుండి ప్రజల దృష్టి మళ్ళించి తాత్కాలిక ఉపశమనం పొందేందుకు ఇటువంటి చవకబారు ప్రయత్నాలు చేస్తుంది.

 

ఒకవైపు తాలిబాన్లు బాంబులు పేల్చుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తుంటే, మరో వైపు ఆ తాలిబాన్లను వేటాడే మిషతో అమెరికా తన డ్రోన్ విమానాలతో పాక్ ప్రజల మీద బాంబుల వర్షం కురిపిస్తోంది. అయినా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ప్రభుత్వాధీనంలో ఉండవలసిన సైనికాధికారులే ప్రభుత్వాన్ని తమ కనుసన్నలలో నడిపిస్తున్నారు. అవినీతికి, అసమర్ధతకు మారుపేరుగా మారిన ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు వీదులకేక్కి నిరసనలు తెలియజేయడం అక్కడ నిత్య కృత్యంగా మారిపోయింది. నానాటికి పెరుగుతున్న ద్రవ్యోల్భణం, దిగజారుతున్న ప్రజల జీవన పరిమాణాలు అన్నీ కలిపి ఆదేశాన్ని 'అశాంతి నిలయం'గా మార్చాయి. ఈ సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్ళించేందుకు భారతదేశాన్నిబూచిగా చూపిస్తూ పాకిస్తాన్ చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలకు భారత్ మూల్యం చెల్లించుకోవలసి రావడం చాల విచారకరం.