నిర్భయ పేరును మనం దురుపయోగం చేస్తున్నామా?
posted on Mar 18, 2013 8:24AM
మూడు నెలల క్రితం డిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార ఉదంతం తరువాత దేశం యావత్తు స్పందించడం, దానికి కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందిస్తూ, త్వరితగతిన కేసును విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పరచడమే కాకుండా, జస్టిస్ వర్మ కమిటీని వేయడం, ఆ కమిటీ కూడా విస్తృత అధ్యయనం చేసి కేవలం నెలరోజుల్లోనే తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించడం జరిగాయి. కేంద్రప్రభుత్వం కూడా వెంటనే స్పందిస్తూ వర్మ కమిటీ చేసిన సిఫార్సులలో కొన్నిటిని స్వీకరించి, మరికొన్నిటికి సవరణలతో త్వరలో పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు తీవ్ర కృషిచేయడం అభినందనీయమే.
కానీ, డిల్లీ ఉదంతం తరువాత మహిళలపై లైంగిక దాడులకు పాల్పడితే తీవ్ర శిక్షలు ఉంటాయని స్పష్టం అయినప్పటికీ, మన దేశంలో ఏదో ఒక ప్రాంతంలో నాటి నుండి నేటి వరకూ మహిళలపై అదే తరహ అత్యాచారాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పైగా అవి ఇదివరకు కంటే ఎక్కువవడం చాలా ఆందోళనకరంగా మారాయి.
‘అతిధి దేవో భవా’ అనే ఒక గొప్ప ఆలోచనకి, సంస్కృతికి మూలమయిన మన భారతదేశంలోనే మొన్న స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఒక విదేశీ పర్యాటకురాలిపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సామూహిక అత్యాచారం జరగడం మనల్ని ప్రపంచదేశాల ముందు తలదించుకోనేలా చేసింది. మళ్ళీ అదే రాష్ట్రంలో గల ఇండోర్ నగరంలో మొన్న శుక్రవారం నాడు బస్సులో ప్రయాణిస్తున్న ఒక నిస్సహాయ మహిళపై మరో సామూహిక అత్యాచారం జరగడం దేశంలో మహిళలకు భద్రత లేదని నిరూపించడమే కాకుండా, మహిళల పట్ల పురుష సమాజపు ఆలోచనలలో కూడా ఎటువంటి మార్పు రాలేదని, అది అంత త్వరగా రాదని కూడా నిరూపించాయి.
‘ఎక్కడ మహిళలు గౌరవింపబడుతారో అక్కడ దేవతలు నివసిస్తారు’ అని ‘స్త్రీలను గౌరవించడం మన సంస్కృతి’ అని ‘కలకంటి కన్నీరు ఇంటికీ, సమాజానికి అరిష్టం’ అనే గొప్ప విశ్వాసాలు గల మన దేశంలోనే ఇటువంటి సంఘటనలు జరుగుతుండటం మన దేశానికి మన సంస్కృతికీ కూడా చాల అవమానం.
ప్రజలు సినిమాలలో మంచికి బదులుగా చెడునే స్వీకరించినట్లుగానే, డిల్లీ ఉదంతం తరువాత సమాజంలో ఆ తరహా సంఘటనలు పునరావృతమవడం గమనిస్తే, ఆ సంఘటన కొందరికి ప్రేరణ కలిగించినట్లు అర్ధం అవుతోంది.
మానసిక శాస్త్ర నిపుణులు ఇటువంటివి ఒక అంటురోగం (సామాజిక మానియా) వంటివని అభిప్రాయపడుతున్నారు. మంచికీ చెడుకీ కూడా సమాజం ఈ మానియాకు లోనవుతుందని తెలిపారు. అటువంటప్పుడు బాధ్యతా కలిగిన ప్రభుత్వాలు, ప్రజలు, మీడియా, ప్రజా సంస్థలు, స్వచ్చంద సంస్థలు అన్నీకూడా చేతులు కలిపి ఒక మంచి భావనలను సమాజంలోకి చొచ్చుకుపొయేలా చేయవలసి ఉండగా, మన ప్రభుత్వాలు డిల్లీలో ఘోర అకృత్యానికి బలైన బాధితురాలిని వీర నారీమణిగా అభివర్ణిస్తూ ఆమె పేరిట పధకాలు, అవార్డులు, చివరికి రైళ్లకు కూడా ‘నిర్భయ ఎక్స్ ప్రెస్’ వంటి పేర్లు కూడా పెడుతూ ఒక ఘోర అకృత్యాన్ని శాస్వితంగా మన కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేయడం దురదృష్టం.
అటువంటి సంఘటనల నుండి పాఠాలు నేర్చుకొని, మళ్ళీ అటువంటి సంఘటనలు దేశంలో మరెక్కడా పునారావృతం కాకుండా ఉండేందుకు సమాజంలో తేవలసిన మార్పులను గురించి, మహిళల పట్ల పురుష సమాజం ఆలోచనల్లో తేవలసిన మార్పుల గురించి, మహిళల భద్రతకు దేశంలో చేప్పట్టవలసిన చర్యల గురించి అవసరమయిన ప్రక్రియలను సమాజంలోకి వ్యాపింప జేయవలసిన ప్రభుత్వాలు, తద్వ్యతిరేఖపు ఆలోచనలును తన చర్యల ద్వారా సమాజంలోకి చొప్పిస్తున్నట్లు కనిపిస్తోంది.
మన దేశంలో జరిగిన ఈ ఘోర అక్రుత్యంపై యావత్ ప్రపంచమూ కూడా తనదైన శైలిలో స్పందించడం ఇంకా మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తోంది. అయితే, ఇటీవలే అమెరికా ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా మన దేశానికి ‘నిర్భయ అవార్డు’ను కూడా ప్రకటించడం, ప్రభుత్వం తో సహా అనేక మంది చాలా సంతోషపడ్డారు. అయితే, మనం ఏదో ఒక ఘనకార్యం చేసినందుకు ఆ అవార్డు రాలేదు. ఒక ఘనమయిన సంస్కృతీ, సంప్రదాయాలకు పెట్టింది పేరయిన మనదేశం ప్రపంచదేశాల మద్య సిగ్గుతో తలదించుకొనేలా జరిగిన ఒకానొక సంఘటనకు ఇచ్చిన అవార్డు అది అని మనం గ్రహించగలిగితే అది మనకి అవార్డు కాదు అమెరికా కొట్టిన చెప్పు దెబ్బ అని మనకి అర్ధం అవుతుంది.
ఒకప్పుడు ఎక్కడో మారు మూల గ్రామాలలో జరిగే ఇటువంటి అకృత్యాలు, నేడు దేశ, రాష్ట్ర రాజధానులలో జరగుతుండటం వలన ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించగలుగుతోంది. అన్ని రంగాలలో ముందడుగు వేస్తున్న మహిళలకు ముఖ్యంగా పెద్దపెద్దనగరాలలో ఉన్నత విద్యలు , ఉద్యోగాలకు వస్తున్న మహిళలకు ఊహించని ఈ పరిణామాలు కలవరం కలిగించడమే కాకుండా, వారి అభ్యున్నతికీ ప్రతిబందకంగా మారుతున్నాయి. క్రమంగా ఒక అంటు రోగంలా దేశమంతా వ్యాపిస్తున్న ఈ సమస్యని ఇక ఎంత మాత్రం ఉపేక్షించ వలసిన విషయం కాదు. ఉపేక్షించడం అంటే పక్కవారి ఇంటికి మంట అంటుకొంటే మనం ఉపేక్షిస్తే ఏమవుతుందో అదే జరుగవచ్చును.
గుజరాత్ వంటి రాష్ట్రాలు అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖుడిని తన బ్రాండ్ ఎంబాసిడరుగా నియమించుకొంటే, మన భారత ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి విదేశాలలో ప్రకటనలు ఇస్తూ విదేశీ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. తత్ఫలితంగా అనేకమంది విదేశీ పర్యాటకులు మన దేశంలో పర్యటించేందుకు వస్తున్నారు కూడా. అయితే, విదేశీయులను ఆకర్షించడానికి చేసే కృషిలో, చేసే ఖర్చులో, చూపే శ్రద్ధలో కనీసం పదోవంతు కూడా (విదేశీ) మహిళల భద్రతపైనా చూపకపోవడం గర్హించాల్సిన విషయం. ముందుగా మహిళల పట్ల మన పురుష సమాజం ఆలోచనలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేయడం, దేశంలో మహిళలకు భద్రత కల్పించడం, మన దేశంలో పర్యటించేందుకు వస్తున్న విదేశీ (మహిళల) యుల రక్షణకు తగిన ఏర్పాట్లతో బాటు, వారికి తగిన భరోసా కలిగించడం వంటి చర్యలు చేపడితే అది మనకు మేలు కలిగిస్తుంది తప్ప ఏదో ఒక ఘనకార్యం చేసినట్లు ‘నిర్భయ’ పేరును వాడుకోవడం వల్ల సమాజం మీద మంచి కంటే చెడు ప్రభావమే ఎక్కువ ఉంటుందని జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఇకనయినా, ప్రజలు, ప్రభుత్వాలు, పోలీసులు, స్వచ్చంద సంస్థలు, మేధావులు మేల్కొని ఈ దిశలో వెంటనే ప్రయత్నాలు చేయడం చాల మంచిది.