పీకేకు అర్ధమైంది.. ఇక జనానికీ అర్ధమౌతుంది.. రఘురామ
posted on Nov 1, 2022 @ 12:37PM
జగన్ వ్యవహారం, వేషాలు పీకేకు అర్దమయ్యాయనీ, ఇక జనానికీ అర్ధమౌతాయనీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన జగన్ వైఖరినీ, దుర్మార్గాన్నీ అర్ధం చేసుకోవడానికి తనకు ఎనిమిది నెలలు పట్టిందనీ, అదే జగన్ ఎన్నికల వ్యూహకర్త పీకేకు అర్ధం కావడానికి మూడేళ్లు పట్టిందనీ, రఘురామ కృష్ణం రాజు అన్నారు. అందుకే పీకే ఇప్పుడు జనగ్ పదవీకాంక్ష సాకారం అవ్వడానికి తాను సహకరించి ఉండకపోయి ఉండాల్సిందని పీకే వ్యాఖ్యలను ఈ సందర్బంగా ఉటంకించారు.
పీకేకి అర్ధమయ్యిందనీ, ఇక జనం కూడా జగన్ పదవీ కాంక్షతో చేసిన చేస్తున్న దుర్మార్గాలను అర్ధం చేసుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా ఒక సినిమాలో తన అధికారం చేపట్టాలంటే.. సానుభూతి అవసరమని భావించిన హీరో కిరాయి హంతకుడి చేత తనను తాన పొడిపించుకున్న దృశ్యాన్ని ఈ సందర్భంగా జగన్ ప్రజలకు చూపించారు. ఇక ముఖ్యమంత్రి ఉన్న చోటనే రాజధాని అంటూ జగన్ ఎత్తుకున్న కొత్త పల్లవి అసంబద్ధంగా ఉందన్నారు. ప్రధాని మోడీకి ఏపీలోని అమరావతి నుంచి పాలన కొనసాగించాలని భావించి భారతదేశ రాజధాని అమరావతే అని ప్రకటించి ఇక్కడ నుంచి పాలన కొనసాగిస్తే జగన్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
జగన్ తన వెసులుబాటు కోసం ఇష్టారీతిగా మాట్లాడి, ఇష్టారీతిగా ప్రవర్తిస్తానంటే ప్రజాస్వామ్యంలో కుదరదని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన బాధ్యతాయుతంగా ఉండాలని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఏపీ సీఎం తీరు, వ్యవహారం అంతా తుగ్లక్ ను పోలి ఉంటుందనడానికి సీఎం ఎక్కడంటే అక్కడే రాజధాని అన్న మాటే ఉదాహరణ అన్నారు.
ఇలాంటి పిచ్చి ఆలోచన ఇప్పటి వరకూ దేశంలోని ఏ ముఖ్యమంత్రికీ రాలేదని, గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఊటీలో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నా దాన్ని రాష్ట్ర రాజధాని అని పేర్కొనలేదని గుర్తు చేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్నప్పటికీ, దాన్ని ఆయన తెలంగాణ రాజధానిగా పేర్కొనడం లేదన్నారు. వారందరికీ భిన్నంగా జగన్ మాత్రం ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాష్ట్ర రాజధాని అంటూ వక్రభాష్యం చెబుతున్నారని విమర్శించారు.
తాను చెబుతున్నంత సులువుగా విశాఖ రాజధాని అయిపోతుందని అనుకుంటే.. మూడు రాజధానులంటూ ఇంత హంగామా ఎందుకు? అసెంబ్లీలో మూడు రాజధానుల తీర్మానాలు ఎందుకు.. కోర్టు కన్నెర్ర చేసిందని మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ ఎందుకు అని రఘురామ ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆరు నెలల వ్యవధి సరిపోదు, 60 నెలల సమయం కావాలని ఎందుకు అభ్యర్థించినట్లు అని నిలదీశారు. విశాఖకు తాను వెళ్తాను… తన వెనుకే మంత్రులు వస్తారు… సచివాలయం వస్తుంది, దాన్నే రాష్ట్ర రాజధాని అని పిలుచుకుంటామని జగన్మోహన్ రెడ్డికి స్పష్టత ఉన్నప్పుడు, సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు దాఖలు చేశారో చెప్పాలన్నారు.