పిల్లి సైకిలెక్కేయడం ఖాయమేనా?
posted on Jul 20, 2023 @ 10:52AM
జగన్ ఫ్యాన్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆయన అడుగులో అడుగు వేసిన వారు.. ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఇప్పుడు అలా దూరమయ్యే వారి జాబితాలోకి వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా చేరిపోయారా? అంటూ పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇప్పటికే జగన్ ను అధికారంలోకి తీసుకురావడం కోసం నాడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేసి ఊరూ వాడా చుట్టేసి జగన్ సోదరి షర్మిల, కుమారుడి అరెస్టును నిరసిస్తూ రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేసిన తల్లి విజయమ్మ, అలాగే జగన్ అంటే ప్రాణమిచ్చే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఇప్పటికే జగన్ కూ, జగన్ పార్టీకీ దూరమయ్యారు.
తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ వైసీపీకి గుడ్ బై చెప్పేసి సైకిలెక్కేసే ప్రయత్నంలో ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్ తో నడిచి, జగన్ కోసం ఎమ్మెల్యే పదవిని, మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన వారిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన జగన్ కు, జగన్ పార్టీకీ దూరం జరుగుతున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.
రామచంద్రపురం నియోజకవర్గ టికెట్ విషయంలో మంత్రి వేణుగోపాలకృష్ణ వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నట్లుగా ఇరువురి మధ్యా విభేదాలు రచ్చకెక్కాయి. దీంతో ఆ పంచాయతీ పార్టీ అధినేత, సీఎం జగన్ వద్దకు చేరింది. ఆ తర్వాత ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు స్వయంగా ఫోన్ చేసినా.. ఈయన స్పందించ లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జగన్‌తోపాటు ఆయన తండ్రి వైయస్సార్ అంటే అత్యంత అభిమానం ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు ఇలా.. తెలుగుదేశం గూటికి చేరేందుకు సిద్ధపడుతున్నారంటే.. జగన్ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తికి గురి కావడమే కారణమై ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
పిల్లి సుబాష్ చంద్రబోస్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయన తనయుడు సూర్య ప్రకాష్ సైతం రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
అయితే వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం వైసీపీ టికెట్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు ఇస్తామంటూ గోదావరి జిల్లాల పార్టీ ఇన్‌చార్జ్ మిథున్ రెడ్డి ఇప్పటికే ప్రకటించేశారు. దీంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆశలపై గోదావరి నీళ్లు చల్లినట్లు అయ్యింది. ఈ నేపథ్యంలో ఆదివారం అంటే జులై 16న వెంకటాయపాలెంలో తన వర్గంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ భేటీ నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ మారాలంటూ పిల్లిపై ఆయన వర్గం తీవ్ర ఒత్తిడి చేసిందనీ, అలాగే ఆ భేటీలో వచ్చే ఎన్నికల్లో వేణుగోపాలకృష్ణ ఓటమే లక్ష్యంగా పని చేయాలనే ఓ తీర్మానం సైతం చేసినట్లు తెలుస్తోంది.
అలాగే ఎన్నికలు ఖర్చుతో కూడుకొన్న పని అని .. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే.. ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో ఆయన తెలుగదేశం గూటికి చేరితే మేలన్న భావనను కూడా పిల్లి మద్దతు దారులు ఆభేటీలో వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అప్పుడు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న అన్ని సామాజిక వర్గాల ఓట్లు.. గంపగుత్తగా పిల్లి ఖాతాలో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఓ అభిప్రాయం సైతం ఈ భేటీలో ఆయన వర్గం నుంచి వ్యక్తమైనట్లు సమాచారం.
అదీకాక.. సీఎం జగన్ అపాయింట్‌మెంట్ సైతం ఇవ్వకపోవడం.. అలాగే జిల్లా రాజకీయాల్లో పిల్లికి సరైన ప్రాధాన్యత లేకుండా పోవడం.. ఇక కాకినాడ సీటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డితో ఘర్షణ జరగడం.. అదే విధంగా గత ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి చెల్లబోయిన వేణుగోపాల కృష్ణ గెలుపునకు పిల్లితోపాటు ఆయన వర్గం శాయశక్తులా శ్రమించి.. అన్ని విధాల సహకరిస్తే.. ఆ తర్వాత పిల్లి సుబాష్ చంద్రబోస్‌తోపాటు ఆయన వర్గాన్ని మంత్రి అండ్ కో లెక్క చేయని పరిస్థితి వచ్చిందనే ఓ విధమైన భావనలో పిల్లితోపాటు ఆయన వర్గం ఉందని... ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ మారడం సహా మరో గత్యంతరం లేదని పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ అయితే సాగుతోంది.