భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
posted on Jul 20, 2023 @ 10:52AM
నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ గ్రేటర్ హైద్రాబాద్ లో అతి భారీగా కురుస్తున్నాయి. గ్రేటర్ లో గత రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌కు అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్‌టీంలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శిధిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని నగర వాసులకు విజ్ఞప్తి చేశారు. వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ టోల్ ఫ్రీ నెంబర్ 9000113667ను ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని టోలీచౌకి మరోసారి నీటమునిగింది. నిజాం కాలనీ, మీరాజ్ కాలనీ లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. టోలిచౌకి ఫ్లైఓవర్ కింద డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.
విద్యా సంస్థలకు సెలవు
తెలంగాణలో గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విటర్ వేదికగా మెసేజ్ పెట్టారు. ‘‘భారీ వర్షాల కారణంగా గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు గురువారం, శుక్రవారం సెలవులు ప్రకటించారు’’ అని ట్వీట్ చేశారు.