గుండెపోటు ఉన్నవారు సెక్స్ లైఫ్ కు దూరం ఉండాలా?
posted on Jan 30, 2023 @ 9:30AM
ప్రస్తుత కాలంలో చాలా చిన్న వయసు వారికే గుండె సంబంధ సమస్యలు వస్తున్నాయి. గత మూడు సంవత్సరాల కాలం గురించి ఆలోచిస్తే కరోనా ప్రభావానికి తీవ్రంగా గురైనవారిలో గుండె సంబంధ సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు పలునివేదికలు తెలుపుతున్నాయి. సమస్యకు బయటకు కనిపించని వారి గురించి వదిలేస్తే, గుండె నొప్పి, గుండె బలహీనపడటం వంటి సమస్యలు బయటపడినవారు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా గుండె నొప్పి వచ్చినవారు చిన్నవయసు వారైతే వారిలో చాలా పెద్ద సంఘర్షణ నెలకొని ఉంది. అదే సెక్స్ లైఫ్.
మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి సంకోచించే ఈ అంశం గురించి తమలో తాము మధనపడే భార్యాభర్తలు ఎందరో ఉంటారు. గుండెపోటు వచ్చినవారు సెక్స్ లైఫ్ కు దూరంగా ఉండాలనేది చాలమంది చెప్పే విషయం, ముఖ్యంగా అందరూ అనుకునే విషయం. కానీ అది చాలా తప్పని అంటున్నారు వైద్యులు.
గుండె పోటు వచ్చిన తరువాత డాక్టర్ ల దగ్గర తమ సందేహాలు అడిగి నివృత్తి చేసుకోకుండా సెక్స్ లైఫ్ కు దూరంగా ఉండాలని తమకు తాము డిసైడ్ అవ్వడం అందరూ చేసే తప్పు.
ఒక వేళ డాక్టరు ఏదైనా చెప్పబోయినా “బ్రతికి బయటపడ్డాను అదే పదివేలు. ఇక అది లేకపోయినా ఫరవా లేదు. ఇక దాని గురించి ఆలోచించను కూడా” అంటూ వినడానికి నిరాకరించేవారు ఎందరో ఉంటారు. కాని తరువాత కొంతకాలానికి దాని అవసరం తెలిసి వస్తుంది. కొందరు భార్యలకు సహజంగానే చిన్నవాటికె భయపడుతూ భర్తలు అలాంటి ప్రస్తావన తెచ్చిన దూరం జరిగిపోతారు.
గుండెపోటు వచ్చిన వారిలో సెక్స్ స్పందనలు ఎలా??
గుండెపోటు వచ్చిన వారిలో కొందరికి సెక్స్ సామర్ధ్యం తగ్గిపోతే, మరికొందరిలో సెక్స్ కోరిక సామర్ధ్యం ఎక్కువైనట్లు కనబడతాయి. దీనికి ప్రధానంగా వారు వాడే మందులే కారణం. కొందరికి రక్తపోటువల్ల గుండెపోటు వస్తుంది. రక్తపోటు తగ్గడానికి వాడే కొన్ని మందులవల్ల సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది. మరి కొందరిలో అంతకుముందు లేని ఉషారు, కోరిక ఎక్కువ అవుతాయి. దీనికి కారణం గుండెపోటు వచ్చిందని కృంగి పోకుండా ఉండేందుకు డాక్టర్లు ఇచ్చే మందులతో మనస్సు ప్రశాంతంగా ఉండటం, సహజమైన వాంఛలతో మనస్సు ఉరకలు వేయడమే.
దూరమా?? దగ్గరా??
గుండెపోటు వచ్చిన వ్యక్తి రెండు మూడు నెలల తరువాత సెక్స్ లైఫ్ ను మునుపటిలా ఆస్వాదించవచ్చు. అయితే భార్యాభర్తలు ఒకరికి ఒకరు సహకరించుకోవడంలో ఒత్తిడి అనే అంశాన్ని సులువుగా అధిగమించవచ్చు.
భయం అపోహనేనా??
సెక్స్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా సంభవించిన మరణాలని పరిశీలిస్తే అది తక్కువ శాతమే. ఎలాంటి టెన్షన్ లు లేకుండా, అక్రమ సంబంధాలలో ఉండకుండా భార్యాభర్తలు ఇద్దరూ హాయిగా గడిపితే ఏ గుండె నొప్పి రాదని, వైఫల సూచించిన సలహాలే శ్రీరామ రక్ష అని అంటున్నారు. సమయానికి తగు నిద్ర, సమయానికి తగు ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంటే సెక్స్ లైఫ్ అనేది ఏవిధంగానూ గుండెపోటుకు కారణం కాదని అది ఇంకా ఒత్తిడి తగ్గించే ఔషదంలా మారుతుందని అంటున్నారు.
Note:- పై విషయాలు అన్నీ పలు సందర్భాలలో వైద్యులు వెల్లడించిన అంశాలు. గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహా తీసుకుని సెక్స్ లైఫ్ ను నిరభ్యంతరంగా ఆస్వాదించవచ్చు.
◆నిశ్శబ్ద.