ఒక్క ఛాన్స్ దెబ్బకి అల్లాడిపోయిన జనం.. జగన్ ని సాగనంపటమే ధ్యేయం!
posted on Dec 20, 2023 @ 2:54PM
ఏపీలో అధికార పార్టీ వైసీపీపై ఇప్పుడు తీవ్ర అసంతృప్తి నెలకొంది. వీళ్ళు, వాళ్ళు అని లేకుండా దాదాపుగా అన్ని వర్గాలలో ఈ అసంతృప్తి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందుకే ఏ సర్వేల ఫలితాలు చూసినా అవి వైసీపీకి వ్యతిరేకంగానే ఉంటున్నాయి. ప్రతిపక్షాలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం చేస్తున్న విమర్శలకు జనం మద్దతు పలుకుతున్నారు. ఇక జగన్ అయితే తనను ధిక్కరించిన వారిపై కక్షసాధించడం, తన పాలనను ప్రశ్నించిన వారిపై ఉక్కుపాదం మోపడంలో సరికొత్త రికార్డులు సృష్టించారు. తనకు అడ్డు లేకుండా విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడం వినా జగన్ మరో ఆలోచన చేయరనే పేరు గడించారు. అన్నీ కలిసి ఇప్పుడు వైసీపీ అంటే ప్రజలలో ఆగ్రహం పెరిగిపోయింది. ఈ విషయం జగన్ కు కూడా తెలుసు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అభ్యర్థులను మార్చేస్తున్నారు. తన రిపోర్టుల ప్రకారం ఎమ్మెల్యేలు ఎవరైతే అసంతృప్తి మూటగట్టుకున్నారో వారందరినీ మరో నియోజకవర్గానికి బదిలీ చేయడం, పార్లమెంటుకు పోటీ చేయించడం, లేదంటే పక్కన పెట్టేయడం చేస్తున్నారు.
మరి ఈ స్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తికి కారణాలేంటి అంటే చాలానే ఉన్నాయి. సీఎంగా జగన్ ఫెయిల్యూర్ అనే దానికి ఏదో ఒక కారణం చూపడం సాధ్యమ కాదనీ, ఈ నాలుగేళ్లలో ఆయన చేపట్టిన ప్రతి కార్యక్రమం, చేసిన ప్రతి పనీ ఆయన వైఫల్యాలను ఎత్తిచూపేదిగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఆయన వైఫల్యాలలో ముందుగా చెప్పుకోవలసింది మాత్రం అమలుకు నోచుకోని జగన్ హీమీలు. జగన్ మాట తప్పడు, మడమ తిప్పడు అంటూ వైసీపీ నేతలు విపరీతంగా గప్పాలు కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు అమలుకు నోచుకోని హామీలపై నిలదీస్తూ జగన్ పాలన అంతా మాటతప్పడం, మడమ తిప్పడమేనని జనం అంటున్నారు. గడపగడపకు వచ్చిన వైసీపీ నేతలను నిలదీస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే.. ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, మెట్రో , వెలిగొండ ప్రాజెక్టు పూర్తి, పోలవరం పూర్తి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి, మాయపట్నం పోర్టు పూర్తి చేస్తామని హామీలిచ్చారు. ఇవన్నీ అభివృద్ధికి సంబంధించిన హామీలు కాగా.. ఇందులో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. అసలు ఎప్పటికి చేయగలరో కూడా ఈ నాలుగున్నరేళ్ల చెప్పలేకపోయారు.
ఇక ఉద్యోగస్తులకు సీపీఎస్ రద్దు, కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్, ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఉచిత వైద్యం, 45 ఏళ్ళు దాటిన అందరికీ పెన్షన్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు, కరెంట్ చార్జీలు, బస్ ఛార్జీలు తగ్గిస్తామని ఊరు వాడా తిరిగి గుప్పించిన ఇలా ఏవీ నెరవేరలేదు. వీటిలో పెట్రోల్, డీజిల్, కరెంట్, బస్సు చార్జీలు తగ్గకపోగా భారీగా పెంచేసి ముక్కు పిండి మరీ వసూళ్లు చేస్తూ జగన్ సర్కార్ రాబందులా మారిందని జనం విమర్శిస్తున్నారు. 30 లక్షలతో ఇళ్ల నిర్మాణం, నిరుద్యోగులకు 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, మెగా డీఎస్సీ ఇచ్చి ఏటా జాబ్ క్యాలెండర్, ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా అమ్మ ఒడి వంటి హామీలు కూడా జగన్ అమలు చేయలేదు. ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది గుండు సున్నా కాగా.. అడపా దడపా కేంద్ర ఇచ్చిన నిధులను అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా జగన్ తన పేరుతో పందేరం చేస్తున్నారు. కేంద్రం దీనిపై సీరియస్ కావడంతో రాష్ట్ర పథకం పేరు లేకుండా చేశారు. ఇక ఉద్యోగాల భర్తీ ఊసేలేకపోవడంతో ఇప్పుడు నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
జగన్ మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చిన మరో హామీ సంపూర్ణ మద్యపాన నిషేధం. దశల వారీగా రాష్ట్రంలో మద్యం అన్నది లేకుండా చేస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టేలా ప్రచారం చేశారు. దీనిపై వైసీపీ వదిలిన షార్ట్ ఫిల్మ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. కానీ ఇప్పుటి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతూ.. వైసీపీ నేతలకే మద్యం షాపులు అప్పజెప్పింది. ఊరికి నాలుగైదు బెల్ట్ షాపులు తెరిచి.. తాగుబోతుల్ని తాకట్టు పెట్టి మరీ కేంద్రం నుండి వేల కోట్ల అప్పులు తెచ్చింది. ఇలా జగన్ ఇచ్చిన హామీలు ఏవీ అమలుకు నోచుకోలేదు. దీంతో వీళ్ళుూ వాళ్ళుూ అని లేకుండా దాదాపుగా అన్ని వర్గాల వారు జగన్ పట్ల, ఆయన పాలన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. పైగా రాష్ట్రం అప్పుల పాలవడం, పారిశ్రామిక.. ఫార్మా రంగం నాశనమవడం, నిర్మాణ రంగం కుదేలవడం, కంపెనీలు రాకపోవడంతో ప్రజలకి ఉపాధి లేకుండా పోయింది. ప్రజలు పన్నులు కట్టడం ద్వారా వచ్చిన ఆదాయంతో బటన్ నొక్కి ఉచిత పథకాలు ఇవ్వడమే ముఖ్యమంత్రిగా తన పని అన్నట్లుగా వ్యవహరిస్తున్న జగన్ తీరు జనంలో ఆగ్రహాన్ని పెంచేసింది.
మొత్తంగా నోటికొచ్చిన హామీ ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన జగన్.. ఆ హామీల అమలు కోసం అడిగిన వారిని అణగదొక్కడమే పాలన అన్నట్లుగా వ్యవహరించిన కారణంగానే ఇప్పుడు ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకతన ఎదుర్కొంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనం మాట ఇవ్వడం తప్పడానికే అన్నట్లుగా సాగిన జగన్ పాలనకు చరమగీతం పాడేందుకే నిర్ణయించుకున్నారు. అందుకే ఎన్నడూ, ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చేస్తున్నారు. మాట తప్పిన, మడమ తిప్పిన జగన్ కు బటన్ నొక్కి వీడ్కోలు పలికేందుకు రెడీ అయ్యారు.
-జ్వాల