జగన్ గాలి తీసేసిన బర్రెలక్క!
posted on Dec 20, 2023 @ 3:18PM
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేసే క్రమంలో ఎప్పుడో గీత దాటేశారు. ఆయనొక సీఎం అని.. ఒకరిపై విమర్శలు చేసే క్రమంలో హుందాగా వ్యవహరించాలన్న ఇంగితం ఆయన మరచిపోయారో లేదా అసలు ఇంగితం అన్నది ఆయనకు లేదో తెలియదు కానీ, ఆయన సీఎం అన్న విషయం మరచిపోయి నేతలు, ఎమ్మెల్యేలతో కలిసిపోయి తన స్థాయిని తానే దిగజార్చుకుని మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నేతల వ్యక్తిగత జీవితాలపై మాట్లాడడమే కాకుండా వెటకారపు నవ్వుతో హేళన చేయడం తన నైజంగా మార్చుకున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే, ఆ మాటకు వస్తే జాతీయ స్థాయిలో సైతం అపార రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు లాంటి వ్యక్తిని ముసలాయనకి వయసైపోయిందంటూ సీఎం కుర్చీలో కూర్చొని హేళనగా మాట్లాడిన జగన్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయంపై కూడా వెటకారపు వ్యాఖ్యలు చేశారు. మనిషై పుట్టాక ప్రతి ఒక్కరికి వయసు అయిపోతుంది.. అందరూ వృద్ధులే అవుతారు. కానీ దానిని మరిచి జగన్ నోరు పారేసుకున్నారు. ఇక పవన్ విషయంలో కూడా అంతే. పవన్ పెళ్లిళ్లపై జగన్ వ్యాఖ్యలు చేయగా.. జగన్ ముత్తాల నుండి వారి వంశంలో ఒకటికంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారిని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడ్డాయి.
ఇప్పుడు జగన్ మరోసారి తెలంగాణలో జనసేన పోటీపై కూడా వెటకారంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సందర్భంగా కాశీబుగ్గ బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై జగన్ విమర్శలు చేశారు. దత్తపుత్రుడిగా యాక్టర్ ను పెట్టుకొని డ్రామాలు ఆడతారంటూ చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేన పోటీపై కూడా మాట్లాడిన జగన్.. పవన్ అభ్యర్థులను నిలబెడుతూ, తెలంగాణలో అన్నమాటలు వింటే ఆశ్చర్యం అనిపించిందన్నారు. తెలంగాణలో తాను పుట్టనందుకు తెగ బాధపడిపోతున్నానని.. అది తన దురదృష్టం అన్నారని.. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్.. ఈ పెద్దమనిషి చంద్రబాబుకు ఇంకొక పార్టనర్ అంటూ విమర్శించారు. చివరికి ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడికి రాలేదని.. డిపాజిట్లు కూడా రాలేదంటూ విమర్శించారు.
ఈ వ్యాఖ్యలపై తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బర్రలక్క హుందాగా కౌంటర్ ఇచ్చారు. ఏపీ సీఎం జగన్ పవన్ ను ఉద్దేశించి విమర్శలు చేసే క్రమంలో తన ప్రస్తావన తీసుకురావడాన్ని బర్రెలక్క ఖండించారు. ఇంకా చెప్పాలంటే బర్రెలక్క జగన్ గాలి తీసేశారు. జగన్ అనుచిత వ్యాఖ్యలపై బర్రెలక్క.. ఎవరి పార్టీ వారిది.. ఎవరి రాజకీయ జీవితం వారిది.. జగన్ పవన్ కల్యాణ్ ను తక్కువ చేసి మాట్లాడటం బాధగా అనిపించిందని అన్నారు. ఎవరి స్థాయి వాళ్ళది.. ఆయన పవర్ ఆయనది.. నా పవర్ నాది.. నేను కూడా పవన్ అభిమానినే. పవన్ కళ్యాణ్ ఎంత మంచోడో జనాలకు బాగా తెలుసు. అలాంటి వ్యక్తిని రాజకీయాల కోసం తక్కువ చేయడం కోసం నాతో పోల్చటం బాధగా ఉంది. పవన్ కల్యాణ్ గ్రేట్ పర్సన్.. ఆయన్ను నేను ఎంతో అభిమానిస్తాను. ఆయన్ను మైనస్ చేయటం కోసం సీఎం స్థానంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి నా ప్రస్తావన తీసుకురావటం మంచిది కాదని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే జగన్ వ్యాఖ్యలపై మండిపడుతున్న జనసైనికులు బర్రెలక్క వ్యాఖ్యలతో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానినని గర్వంగా చెప్పుకున్న బర్రెలక్కకు ఇండిపెండెంట్ గా పోటీ చేసి తనకు కూడా దమ్ము ఉందని నిరూపించుకుందనీ, వైసీపీ తెలంగాణలో పోటీ చేసే దమ్ము లేక అక్కడ నుండి బిచాణా ఎత్తేసిందనీ ఎద్దేవా చేస్తున్నారు. అసలు వైసీపీ కనీసం పోటీ కూడా చేయని చోట.. పోటీకి దిగి తన ఉనికి కోసం ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ పై జగన్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని రాజకీయ వర్గాలలో కూడా నిరసన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా బర్రెలక్కతో పోల్చి జగన్ చేసిన వ్యాఖ్యలు.. దానికి బర్రెలక్క కౌంటర్లు చూసినోళ్లు.. బర్రెలక్క ప్రస్తావన తీసుకురావటం ద్వారా సీఎం జగన్ తప్పు చేశారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బర్రలక్క వ్యాఖ్యలు జగన్ రాజకీయ అవగాహనా రాహిత్యాన్ని బట్టబయలు చేశాయని అంటున్నారు. బర్రెలక్క హుందాగా జగన్ వ్యాఖ్యలను ఖండించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.