రాజీనామాపై పవార్ యూటర్న్
posted on May 5, 2023 @ 8:20PM
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు, 24 ఏళ్లుగా పార్టీ బరువు బాధ్యతలు మోస్తున్న, పార్టీ పెద్దదిక్కు శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. నూతన అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఆయనే పార్టీ కీలక నేతలతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీ పవార్ రాజీనామాను తిరస్కరించింది. పవర్ సాబ్ ..మీరే కావాలని తీర్మానం చేసింది . ఆయన స్థాపించిన పార్టీకి ఆయనే నాయకత్వం వహించాలని, అధ్యక్ష పదవిలో కొనసాగాలని కోరుతూ 18 మంది కమిటీ సభ్యలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ ఈ సమావేశం వివరాలను మీడియాకు తెలిపారు.
శరద్ పవార్ ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని కోరుకున్నారు. అయితే ఎన్సీపీ కోర్ కమిటీ పవార్ రాజీనామాను ఏకాభిప్రాయంతో తిరస్కరించిందని చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగాలని ఆయనను కోరాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేసిన తర్వాత దేశంలోని అనేక పార్టీల నేతలు ఆయనను సంప్రదించారని తెలిపారు. ఆయన కుమార్తె సుప్రియ సూలేతో పాటు తాను కూడా తమ అభిప్రాయాలను ఆయనకు చెప్పామన్నారు. వివిధ జిల్లాల్లోని పార్టీ కేడర్ కూడా పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పుకోకూడదని కోరుకుంటున్నదని తెలిపారు.
ఈ సమావేశంలో ఎన్సీపీ నేతలు అజిత్ పవార్, సుప్రియా సూలే పాల్గొన్నారు. ఈ కమిటీలో వీరితోపాటు సునీల్ టట్కరే, కేకే శర్మ, జయంత్ పాటిల్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, అనిల్ దేశ్‌ముఖ్, రాజేశ్ టోపే, జితేంద్ర అవహద్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, జైదేవ్ గైక్వాడ్, నరహరి ఝీర్వాల్, ఎన్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఫౌజియా ఖాన్, యువజన విభాగం అధ్యక్షుడు ధీరజ్ శర్మ పాల్గొన్నారు.
అయితే కమిటీ నిర్ణయాన్ని పవార్ ఆమోదించారు. నిజానికి, ఎన్సీపీ అధ్యక్షుడిగా కొనసాగడంపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని.. శరద్ పవార్ ఇప్పటికే ప్రకటించారు. అయితే.. అధ్యక్షుడిగా పవార్‌ను కొనసాగిస్తూ.. కొత్తగా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని తీసుకురావాలని పార్టీలోని కీలక నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసుకొస్తే.. ఆ బాధ్యతలను పవార్ కుమార్తె బారామతి ఎంపీ సుప్రియా సూలే కు లేదా ఆయన సమీప బంధువు పార్టీలోఅత్యంత కీలక క్రియాశీల నేత అజిత్ పవార్‌కు అప్పగిస్తారని, కాదంటే ఇద్దరికీ సామాన ఎత్తులో రెండు కుర్చీలు వేస్తారని అంటున్నారు.
అయితే గత కొంతకాలంగా ఎన్సీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, పైకి కనిపించని రాజకీయం ఏదో లోలోపల రగులుతోందనే అనుమానాలు మహా రాజకీయ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నాయి. ఒక విధంగా పవార్ కుమార్తె సుప్రియా సూలే, పవార్ సోదరుని కుమారుడు అజిత్ పవార్ మధ్య గత కొంత కాలంగా సాగుతున్న వారసత్వ తగువు రగులుతున్న విషయం బహిరంగ రహస్యమే. ఈ నేపధ్యంలోనే శరద్ పవార్ ఇంటి గుట్టు బయటకు రాకుండా వ్యూహ రచన చేసారని అంటున్నారు. అందులో భాగంగానే రాజీనామా ఎపిసోడ్ నడిచిందనీ అంటున్నారు. నిజానికి ఇంతవరకు జరిగిన ..ఇప్పుడు జరుగుతున్న..రేపు జరగనున్న పొలిటికల్ డ్రామా శరద్ పవార్ డైరెక్షన్ లోనే జరిగిందని, జరుగుతోందని అంటున్నారు.