బాలినేని శ్రీనివాసులరెడ్డి డిసైడైపోయారా?
posted on May 6, 2023 9:29AM
మాజీ మంత్రి బాలినేని వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్ కూ షాకుల మీద షాకులు యిస్తున్నారు. ఆయన అనుచరులు సైతం వైసీపీ జెండా ఎత్తడం మానేశారు. హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చిన సందర్భంగా శుక్రవారం బాలినేనికి ఆయన అనుచరులు ఘన స్వాగతం పలికారు. ఆ స్వాగత సంరంభాలు తన నేతకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా కాకుండా బాలినేన బలప్రదర్శనా అన్నతీరుగా ఉన్నాయి.
హైదరాబాద్ నుంచి ఒంగోలు చేరుకున్న ఆయనకు స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ఆయన అనుచరుల చేతిలో కానీ, బాలినేనికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కానీ ఎక్కడా వైసీపీ ప్రస్తావనే లేకపోవడంపై స్థానికంగా ఆశ్చర్యం వ్యక్తమైంది. అలాగే బాలినేని బాలినేని అంటూ జిందాబాద్ నినాదాలు చేశారే కానీ ఎక్కడా జగన్ పేరు కానీ, వైసీపీ పేరు కానీ ఎత్తలేదు. ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కు అంటూ ఎవరైనా ఉన్నారంటే అది బాలినేని మాత్రమే. అటువంటి బాలినేని జగన్ పిలిచి బుజ్జగించినా కోర్డినేటర్ పదవి వద్దంటే వద్దని వదులకున్న నాడే ఆయన ఎక్కువ కాలం వైసీపీలో కొనసాగే అవకాశాలు లేవని అంతా భావించారు.
అయితే పార్టీ వీడుతున్నట్లు ఆయన ఎక్కడా చెప్పలేదు. తాను తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమౌతాను అని క్లారిటీ యిచ్చారు. అయితే ఆయన జనసేన పార్టీకి దగ్గరౌతున్నారన్న అనుమానాలు వైసీపీలో ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ అనుమానాలకు తగ్గట్టుగానే జనసేన నుంచి ఆయన రాకకు ఎటువంటి అభ్యంతరాలూ లేవన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే బాలినేని యిప్పటికిప్పుడు ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా? అంటే.. పరిశీలకులు ఆ అవకాశం లేదని చెబుతున్నారు.
మొత్తం మీద బాలినేనికి వైసీపీ పట్ల ఆశలు సన్నగిల్లాయనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదని చెబుతున్నారు. అలాగే జగన్ కు కూడా బాలినేని విషయంలో దూరం ఉంచితేనే బెటర్ అన్న అభిప్రాయం కలిగిందనీ అంటున్నారు. బాలినేనిని రెచ్చగొట్టడానికా అన్నట్లు గోనె ప్రకాశరావు తిరుపతిలో మీడియా సమావేశంలో బాలినేని గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలినేని చూపు తెలుగుదేశం వైపు ఉందన్న గోనె ప్రకాశరావు వ్యాఖ్యలను బాలినేతి తీవ్రంగా ఖండించారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన గోను ప్రకాశరావు వ్యాఖ్యలను ఖండిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. సొంత పార్టీకి చెందిన వారే ఒక వ్యూహంతో, పకడ్బందీగా తనపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను వైసీపీ కోసం ఎంతో చేశాననీ, ఎన్నో త్యాగాలు చేశాననీ, వాటి ఫలితమేనా యిది అని బాధపడ్డారు. కార్యకర్తలకు యిసుమంతైనా మేలు చేయలేని కోఆర్డినేటర్ పదవి తనకు వద్దుగాక వద్దని పునరుద్ఘాటించారు. ఆయన బహిరంగంగా పేరు పెట్టి విమర్శించకపోయినా.. ఆయన విసుర్లన్నీ జగన్ ను ఉద్దేశించేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద యిప్పటికిప్పుుడు కాకపోయినా.. బాలినేని వ్యవహారం వైసీపీలో ముందు ముందు మరిన్ని సంచలనాలకు కారణమౌతుందని అంటున్నారు.