పవార్ చూపు కమలం వైపు
posted on Apr 25, 2023 @ 12:45PM
మహారాష్ట్రలో పవర్ కోసం పవార్ పాలిటిక్స్ కు పదును పెడుతున్నారు. రాజకీయ భీష్ముడిగాపేరు పొందిన శరద్ పవార్ఈసారి మహారాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్ప బోతున్నారు. ఇందుకోసం శరద్ పవార్ తన వ్యతిరేక వర్గమైన బీజేపీతో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. దీంతో మహారాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.
ఎన్సీపీ, కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన పార్టీలతో ఏర్పడ్డ మహావికాస్ అగాఢీ నుంచి బయటకువచ్చిన ఏక్ నాథ్ షిండే బీజేపీ సాయంతో మహా పీఠాన్ని అదిష్టించారు. ఎక్నాథ్ షిండేను సమర్ధిస్తున్న ఎమ్మెల్యేలఅనర్హతపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. తీర్పు షిండేకు వ్యతిరేకంగా రావచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి శరద్ పవార్ రంగంలోకి దిగారు.
ఈసారి పవార్ తన మేనల్లుడు అజిత్పవార్ను ముఖ్యమంత్రిని చేయాలన్న తలంపుతో బీజేపీతో జతకట్టేందుకు సిద్ధమయ్యారు. మహావికాస్ అగాఢీ కూటమిలో మరో చీలిక అనివార్యమైన నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా పవార్ కుటుంబంపై ఉన్న కేసులు, ఆరోపణలు ఈ దెబ్బకు రద్దవుతాయనీ, 2024 తరువాత బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే శరద్ పవార్ కు సముచిత గౌరవం కల్పించేందుకు బీజేపీ అధిష్ఠానం సూత్రపాయంగా అంగీకరించిందనిముంబయ్ మీడియా లో ప్రచారం జరుగుతోంది.